ఆనందో బ్రహ్మ

 ఆనందోబ్రహ్మ

ముప్పయొచ్చాయని సంబర పడకముందే,
గుర్తొచ్చింది!!!
బట్టొచ్చింది
పొట్టొచ్చొంది
చేవ చచ్చింది
కొంచెం ఎక్కువ నడిస్తే అలుపొచ్చింది
ఏం చేద్దామన్నా ఓపిక-చచ్చింది

కాళ్ల నొప్పులు,
కీళ్ల నొప్పులు,
కండరాలు పట్టేసుడు

ఒకటేమిటి, ఒక వైద్య విద్యార్థి,
MBBS లేదా MD చేయాలంటే
కావల్సిన అన్ని రోగాల పట్టా వచ్చింది

అప్పుడొచ్చింది, ఆలోచన…
డాక్టరు గారిని కలవాలని,
నా రోగాలు తగ్గిస్తాడో లేదో అని,
అతనినే పరీక్షించాలని!!!

డాక్టరు గారిని కలిశాను,
2 వ ఎక్కం సదివే పిల్లగానిలాగా
అడగకముందే అన్నీ పూస గుచ్చినట్టు చెప్పాల్సొచ్చింది

అంతా విన్నాక,
ఆ డాక్టరు… పేరు సరిగా గుర్తు లేదు
ఈనందో, “ఆనందో – బ్రహ్మ” లిపిలో
కొన్ని మందులు రాశాడు.

అసలే బ్రహ్మ లిపి!!
ఏమీ అర్థం కాక,
బిక్కమొహం వేసుకుని,
ఏం రాశారు అని అడగగా, చెప్పాడు

“నీకున్నది శారీరక జబ్బు కాదు
మానసిక జబ్బు!

ఒంటి పైకి, ఇంత వయసొచ్చినా
నీ సొంతంగా నువ్వు చేసిన పని ఏదీ లేదు,
చివరికి నీ పుట్టుకతో సహా!!!

సదవాల్సొచ్చింది
పాసవ్వాల్సొచ్చింది
ఉద్యోగం చేయాల్సొచ్చింది
పెళ్లి చేసుకోవాల్సొచ్చింది
పిల్లల్ని కనాల్సొచ్చింది

అంతటితో సమాజం నీకు స్వేచ్ఛనిచ్చింది
సొంతంగా బతకాల్సొచ్చింది

అందుకే,
నీ భవిష్యత్తులోకి చీకటొచ్చింది
నీ ఇంట్లోకి భయమొచ్చింది
భార్యతో తగువొచ్చింది
బంధువులతో దూరమొచ్చింది

నీకు భూమి మీదున్న సకల రోగాలొచ్చాయి

నిజానికి నీకు స్వతంత్రమొచ్చింది
నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశమొచ్చింది
నీ భవిషత్తు తాళంచెవి, నీ చేతికొచ్చింది
నీకు మరో పుట్టుకొచ్చింది

ఇప్పటినుండి,
నీకు నచ్చింది చెయ్
జగానికి నిన్ను కొత్తగా పరిచయం చెయ్
ప్రయత్నం చెయ్
పడి లేవడం నేర్చెయ్

అప్పుడు, ఆ రోజు అది,
నలపయ్యో, యాబయ్యో, అరవయ్యో
ఈ నీ రోగాలు ఒక్కొక్కటే దూరమవుతాయి
నీకు మళ్ళీ నవ యవ్వనం వస్తది”

అదే ఈ ఆనంద్. ఓ – బ్రహ్మ లిపిలో రాసింది అని

“శ్రీ” రాత

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *