అమ్మో ఇల్లు

అమ్మోఇల్లు

 

గిరిజ తల్లి కాబోతుంది అని తెలిసి చాలా సంతోషించింది. గిరిజ భర్త రాము కూడా చాలా సంతోషించాడు. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. అయినా వేచి చూసి పెద్దల్ని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు గిరిజ గర్భవతి అని తెలిసి రెండు ఇళ్ళలోనూ సంతోషం వెల్లి విరిసింది.

రాము సాప్ట్ వేర్ ఉద్యోగి కావడం తో హైదరాబాద్ లో కాపురం పెట్టారు. ఒక అపార్ట్ మెంటు లో నాలుగో ఫ్లోర్ లో ఉన్నారు. అయితే అక్కడ లిఫ్ట్ అప్పుడప్పుడు అగిపోతూ ఉంటుంది. దాంతో స్టెప్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు గిరిజ గర్భవతి అవడం వల్ల ఈ సమస్య వచ్చినా తొందరగా వెళ్ళాలని మంచి ఇల్లు కోసం. వెతక సాగాడు రాము.

ఆసుపత్రికి దగ్గరగా , ఇండిపెండెంట్ గా ఇల్లు కావాలని చూస్తున్నాడు కానీ ఎక్కడా దొరకడం లేదు. ఇలా కాదని ఒక బ్రోకర్ కి డబ్బులు ఇచ్చి ఇల్లు వెతికి పెట్టమని చెప్పాడు. దాంతో ఆ బ్రోకర్ ఆ పని లో ఉన్నాడు.

నాలుగు రోజులు గడిచాక బ్రోకర్ ఫోన్ చేశాడు సర్ మీరు అడిగినట్టు గా ఇల్లు దొరికింది. కానీ కాస్త పాత ఇల్లు కానీ పక్కనే ఆసుపత్రి ఉంది అని చెప్పడం తో పాటూ అద్దె కూడా తక్కువగా ఉండడం వల్ల రాము వెంటనే ఒప్పుకున్నాడు. ఏవైనా రిపేర్లు ఉంటే చేయించుకుని ఉండొచ్చు అనే ఉద్దేశ్యం తో ,అదే విషయం గిరిజకు చెప్పాడు.

ఒక మంచి రోజు చూసుకుని ఆ ఇంట్లోకి వచ్చారు దంపతులు ఇరువురూ, దగ్గరే ఆసుపత్రి ఉండడం అన్ని దగ్గరే ఉండడం తో గిరిజ కూడా సంతోషించింది. చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించాడు రాము. బ్రోకర్ తన డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు.

అలా వారం రోజులు గడిచాయి. ఇంతలో రాము కి నైట్ షిఫ్ట్ కి ఉద్యోగం మారింది. ఇదివరకు కూడా ఇలాగే ఉండడం తో గిరిజ ఏమంత ఇబ్బంది రాలేదు. ఇప్పుడు ఒక్కతి ఉండాలంటే ఉంటావ అని అడిగాడు రాము .

భలే వారే నేను ఉండలేనా ఆ మాత్రం మీరు వెళ్ళండి అంది గిరిజ. అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు రాము. సరే అంటూ సాగనంపింది గిరిజ.

**********

రాము వెళ్ళాక గిరిజ టీవీ చూస్తూ కాలం గడిపింది. తర్వాత ఒక్కతే కాబట్టి పొద్దున అన్నం తో తినేసి పడుకుంది.

అర్ధరాత్రి వరకు బాగానే పడుకున్న గిరిజ కు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఎందుకు మేల్కొంది తెలియక అటు ఇటు చూసి తిరిగి నిద్ర పోవటానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకుంది. తర్వాత హాయిగా ప్రశాంతంగా నిద్ర పోయింది.

వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. వారం కాగానే రాము రావడం తో గిరిజ పుట్టింటికి వెళ్తాను అంది. అదేంటి అప్పుడే ఎందుకు ఇంకా చాలా సమయం ఉంది కదా అంటూ రాము అడిగినా కూడా గిరిజ పట్టుబట్టింది వెళ్తాను అని దాంతో రాము చేసేది లేక గిరిజన పుట్టింట్లో దిగబెట్టి వచ్చాడు.

కాలo గడిచింది. గిరిజ పండంటి బాబు కి జన్మను ఇచ్చింది. హడావుడి అంతా ముగిశాక రాము తిరిగి కాపురానికి తీసుకుని వెళ్లడానికి వచ్చాడు. కానీ గిరిజ రాను అంది ఎందుకు రావు అనగానే అమ్మో నేను ఆ ఇంటికి అసలు రాను. మీరు ఇంకో ఇల్లు చూశాకే వస్తాను అంటూ మొండి గా అనడం తో రాము ఎందుకు రానంటుందో అర్దం కాక తిరిగి వెళ్ళిపోయాడు.

రాముకి రెండు రోజులు సెలవు రావడం తో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. రాత్రి అయ్యింది. సరిగ్గా పన్నెండు గంటల కు మెలకువ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియక మళ్లీ కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్ర రాలేదు అయితే ఏదో శబ్దం వస్తుంది అని గమనిస్తూ లేచి కూర్చున్నాడు. ఆ శబ్దం ఏమిటా అని బెడ్ రూమ్ అంతా చూసాడు కానీ ఏమి కనిపించలేదు. తిరిగి నిద్ర పోయాడు.

మర్నాడు రాత్రి కి. కూడా అలాగే అవడం తో రాము అసలు ఆ శబ్దం ఏమిటో చూద్దామని ఇల్లంతా తిరుగుతూ అన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే అతనికి ఒక చోట ఒకటి కనిపించింది. అది అటూ ఇటూ దూకుతూ ఉంటే వస్తున్న శబ్ధం అది. అది చూసి రాము నవ్వుకున్నాడు.

తర్వాత రాము గిరిజ అమ్మో ఆ ఇల్లా అనడం గుర్తొచ్చి దానికి కారణం ఇదే అయ్యుంటుంది అని అనుకుంటూ గిరిజ ఇంత పిరికిది అనుకోలేదు అనుకుంటూ దాన్ని తీసి పక్కన పెట్టాడు.

ఇంతకీ అదేంటంటే ఒక అబ్బాయి డోలు పట్టుకుని వాయిస్తున్న బొమ్మ, అది కూడా చాలా పెద్ద బొమ్మ ,గిరిజ గర్భవతి అని తెలిసి స్నేహితులు ఎవరో బహుమతిగా ఇచ్చిన బొమ్మ రాత్రుళ్లు ఆ బొమ్మ లో ఉన్న డోలు పై నుండి బల్లి అటూ ఇటూ దూకడం తో ఆ శబ్దం వస్తుంది.

తెల్లారి రాము ఆ బొమ్మతో కలిసి గిరిజ దగ్గరికి వెళ్లాడు. గిరిజ అనుమానంగా చూసింది . రాము బల్లి ఎలా ఆ డోలు పై దుకుతుందో అలాగే కర్ర పుల్లలతో చేసి చూపించాడు. దాంతో గిరిజ పక్కున నవ్వింది. బాబు కూడా విరిసి విరియనీ పెదవులతో చిన్నగా నవ్వాడు…..

 -భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *