అమ్మాయి మనసు.
ప్రేమ అజరామరమైనది.. అనంతమైనది. అది మనిషిలో ఒక్కసారే పుడుతుంది. జీవిత పర్యంతం నిలిచే ఉంటుంది.. అలా కాని పక్షంలో దాని స్వచ్ఛతను, సున్నితత్వాన్ని అనుమానించాల్సిందే! ఆ సత్యాన్ని తేటతెల్లo చేస్తూ రాసిందే నా ఈ అమ్మాయి మనసు.
****””
“మధు మాసం “… నిండు చందమామ ఆహ్లాదకరమైన వెన్నెలను విరజిమ్ముతోంది. రకరకాల పూల మొక్కలతో కూడిన ఆ అందమైన తోటలో ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న ఊయలలో శ్వేత వర్ణంలో ఉన్న సుతిమెత్తని దిండ్లకి చేరగిలపడి చేతిలోని కప్పులోంచి ఫిల్టర్ కాఫీని ఒక్కొక్క సిప్ ఆస్వాదిస్తూ తాగుతూ ఒక రకమైన పారవశ్యంలో మునిగితేలుతోంది అనుపమ.
పిండారబోసినట్లుగా ఉన్న ఆహ్లాదకరమైన వెన్నెల వెలుగులో ఏకాంతంగా ఆలోచనాతరంగాలలో తేలిపోతూ గడపడం అంటే అనుపమకి చాలా ఇష్టం. అందుకనే తనకు జాబ్ రాగానే మంచి లొకేషన్లో చిన్న ఇల్లు నిర్మించుకుని, తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకుంది.
ఇంటి చుట్టూ చక్కని గార్డెన్ ను ఏర్పాటు చేసుకుంది. అనుపమ మంచి చదువరే కాకుండా రచయిత్రి కూడా. సాయంత్రం ఇంటికి రాగానే పనులన్నీ ముగించుకొని పుస్తకము, పేపర్లు, కలమూ తీసుకుని గార్డెన్ లోకి చేరిపోతుంది.
ఆమె కలం నుండి వెలువడిన ప్రతి రచనకు ఆ పండువెన్నెల్లోనే, ఆ పచ్చని తోటలోనే శ్రీకారం చుట్టడం జరిగింది. కానీ ఎందుకో ఈరోజు ప్రతిసారి లాగా ఆమె ఆలోచనలు సజావుగా సాగడం లేదు. ఉండీ ఉండీ ఆమె ఆలోచనలకు ఆటంకం కలుగుతోంది. రోజూ లాగా తన తోటలోని అన్ని పూలన్నిటికంటే అపురూపంగా అనిపించే గులాబీల సువాసనను కూడా ఆస్వాదించలేక పోతోంది.
మనసులో ఏవో అలజడులు చెలరేగుతూ కలవరపాటుకు గురి చేస్తున్నాయనడానికి నిదర్శనంగా అనుపమ మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఆలోచనలకు కళ్లెం వేయడంలో నిస్సహాయురాలవుతున్నట్లుగా గతంలోకి పరుగులు తీయబోతున్న మనసును ఒడిసిపట్టి వర్తమానంలోకి తీసుకురావడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.
ఒక్కసారి చిన్నగా తల విదిలించి కాఫీ కప్పు పక్కన పెట్టి సగం చదివినట్లుగా బోర్లించి ఉన్న పుస్తకం మళ్లీ చేతుల్లోకి తీసుకుంది అనుపమ. “ట్యూస్డేస్ విత్ మోరీ” టైటిల్ తో ఉన్న ఆ చిన్న పుస్తకాన్ని చూడగానే అనుపమ కళ్ళు ఆనందమో, బాధో తెలియని ఏదో స్పందనకు గురైనట్లుగా చిన్నగా చెమ్మగిల్లాయి. ఆమె సుతిమెత్తని హస్తాలు ఒక్కసారి ఆ పుస్తకాన్ని ఆప్యాయంగా, ఆర్తిగా తడిమాయి.
ఒక్కసారి ఆలోచనలు వెనక్కి పరిగెత్తాయి.
ఆ పుస్తకంపై తన ఇష్టాన్ని చెప్పినప్పుడు అది దొరకడం లేదన్న తన దిగులుని గమనించి ఎలా వెతికి తెచ్చాడో కానీ రెండు రోజుల్లో తన చేతుల్లో ఆ పుస్తకాన్ని ఉంచి, అప్పుడు తన కళ్ళల్లో వ్యక్తమైన ఆనందాన్ని తనివితీరా చూసుకుని మురిసిపోయిన.తన చెలికాని రూపం అనుపమ మనోఫలకం మీద ప్రత్యక్షమయ్యింది..
పోత పోసిన విగ్రహం లాంటి రూపం, పచ్చని వర్చస్సుతో చిన్నగా నవ్వినా సొట్టలు పడే చెక్కిళ్లతో హుందాగా నడిచి వస్తూ ఏకంగా తన హృదయ మందిరంలోనే తిష్ట వేశాడు. తండ్రి తప్ప పరపురుషుని కన్నెత్తి కూడా చూడని కట్టుబాట్ల పంజరంలో పెరిగిన తనకు అపారమైన జలనిధి లాంటి ప్రేమ వలను విసిరి తనతో పాటు ఆనంద ధామాలవైపు తన చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు.
ఆనందంతో తన కళ్ళు చిప్పిల్లినా, ఆందోళనతో అతని గుండె తల్లడిల్లిపోయేది. చిన్నగా అలక నటించినా అతని తనువు చిగురుటాకులా కంపించేది. తన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం తనను చేరుకోలేనేమోనన్న కలతను వ్యక్తం చేసినప్పుడు హృదయాంతరంగములో చెలరేగుతున్న ఉప్పెనలను నియంత్రించుకొని ఊరడించేవాడు. భయం వద్దని భరోసా ఇచ్చేవాడు.
ఐదేళ్ల క్రితం జరిగిన చేదు సంఘటనలను ఎంత దూరం పెట్టాలన్నా ఈ రోజు పదేపదే అనుపమ కళ్లెదుట సాక్షాత్కారమవుతున్నాయి.
అందుకు కారణమైన ఆరోజు లంచ్ టైంలో ఫోన్లో అమ్మ అన్న మాటలు చెవుల్లో మార్మోగుతున్నాయి.
“అనూ..నీకు 30 ఏళ్ళు దాటుతున్నాయి. ఇంకా పెళ్లి మాటెత్తడం లేదు. సంపాదన ఒక్కటే జీవిత ధ్యేయం కాదు. జీవితంలో నేనున్నానంటూ ఒక తోడు ఉండడం చాలా అవసరం.
ఇప్పుడు నీకు తెలియక పోవచ్చు. మేము పెద్ద వాళ్ళం అయిపోయాము. ఎప్పటికీ నీతో ఉండలేము కదా మా తర్వాత అయినా నీకు నేను ఉన్నాననే బంధం ఒకటి ఉండాలి కదా!
ఇప్పుడు మా మాట వినకపోతే ముందు ముందు జీవితంలో ఎంత నష్టపోయావో నీకే అర్థమవుతుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత అర్థం లేనిదో తెలిసే సమయానికి అంతా మించిపోతుంది. పరిస్థితులు చేయి దాటిపోయాక చేయడానికంటూ ఏమి మిగిలి ఉండదు. అందుకే నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో!
నువ్వు ఒకసారి వచ్చి చూస్తే ఆ మంగళగిరి సంబంధం ఖాయం చేయాలనుకుంటున్నాం. ఆ అబ్బాయి నీకు అన్ని విధాలా తగిన వాడు. పైగా నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇంకా గతంలోనే జీవిస్తూ పెళ్లి చేసుకోను అని అనడం సరైనది కాదు. జీవితంలో మనం ఆశించినవన్నీ అందాలని ఏమీ లేదు అలా కానప్పుడు ప్రాప్తం ఇంతే అనుకొని ముందడుగు వేయాలి కానీ అక్కడే ఆగిపోకూడదు.
ఇప్పటికైనా నా మాట విను. మనల్ని ఇష్టపడే వాళ్లను పోగొట్టుకుంటే భవిష్యత్తులో ఏదో ఒకనాడు పశ్చాత్తాపపడే పరిస్థితి రావచ్చు! ఒక్కసారి ఆలోచించుకో..”
అమ్మ మాటలతో ఒక్కసారిగా ఆలోచనల తేనె తుట్టను కదిపినట్టుగా అయింది. తాను మరిచిపోయాను అని భ్రమ పడుతున్న ఆ సంఘటన తాలూకు సన్నివేశాలు కళ్ళ ముందు నిలిచాయి. ఐదేళ్ల వెనక్కి పరుగులు తీస్తున్న ఆలోచనలకు ఈసారి కళ్లెం వేయడానికి ప్రయత్నించలేదు అనుపమ.
“అనుపమా..” నాన్న గర్జన లాంటి పిలుపుకు అప్పుడే కాలేజి నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి అమ్మ ఇచ్చిన కాఫీ తాగబోతున్న అనుపమ ఒక్కసారిగా అపాదమస్తకం వణికిపోయింది.
ఆమె చేతులలోని కాఫీ ఒలికి నాలుగు చుక్కలు చేతిపై ఒలికిపడ్డాయి. అంత పొగలు కక్కే కాఫీ సైతం పుట్టించలేని మంట, తండ్రి పిలుపు లాంటి అరుపుతో ఏం జరిగి ఉంటుందోనన్న ఆందోళన అనుపమ సుకుమార హృదయంలో సెగలు రేపింది.
“నాన్నగారు పిలిచారా…” భయంతో వణుకుతున్న కంఠంతో అడిగింది అనుపమ.
అప్పుడే బయట నుంచి వచ్చి గుమ్మంలో చెప్పులు కూడా విడవకుండా నిప్పుకణికల్లా మండుతున్న కళ్ళతో ఉగ్రరూపంతో ఆపాదమస్తకం కంపించిపోతూ నాన్న రూపం దర్శనమిచ్చింది.
“రామేశం మామయ్య బజార్లో కనిపించి చెప్పాడు. ఎవడితోనో కాఫీ షాప్ లో చనువుగా కనిపించావటా?. ఎవడు వాడు? వాడికి నీకు సంబంధం ఏంటి??”తీవ్రంగా వచ్చాయి మాటలు.
నోట మాట రాలేదు అనుపమకి. మామూలు పరిస్థితుల్లోనే నాన్న ఎదుట మాట్లాడలేను. అలాంటిది ఇప్పుడు. ఒళ్లంతా ఒక్కసారిగా చెమటలు పట్టాయి. మాటలు బయటకు రానీయకుండా గొంతు బిగుసుకుపోయింది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో అప్పుడు వస్తుందని తెలుసు. కానీ ఈ రూపంలో ఇంత త్వరగా వస్తుందని మాత్రం ఊహించలేదు.
భర్త అరుపుకు వంటింట్లో పనిచేసుకుంటున్న అనుపమ తల్లి ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చి భర్త ఉగ్రరూపాన్ని చూసి రెండు అడుగులు వెనక్కి వేసి తలుపు చాటున నిలబడి కూతురి వైపు భయంగా, అయోమయంగా చూసింది.
నాన్న ప్రశ్నకు సమాధానం చెప్పక తప్పని పరిస్థితి అది. వేగంగా కొట్టుకుంటున్న గుండెలను అదుపులోకి తెచ్చుకుంటూ తడబడుతున్న గొంతుతో ” నాన్న.. అతను నా క్లాస్ మేట్ సమీర్ అని! మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం . పెళ్లి.. పెళ్లి చేసుకోవాలని”
“సమీర్ అంటే తురక పిల్లాడా?”
తండ్రి కళ్ళల్లోకి చూసే ధైర్యం ఏమాత్రం లేదు. కళ్ళు దించుకునే వణుకుతున్న పెదాలతో..
“అవును నాన్న ! కానీ తను చాలా మంచివాడు..,”
“తురకోన్ని ప్రేమిస్తున్నా అని చెప్పడానికి సిగ్గు లేదు నీకు. మన వంశం, పరువు ప్రతిష్ట అన్నీ మరిచిపోయి వాడితో తిరుగుతావా? పెళ్లి చేసుకుంటానంటావా ?నిప్పులు కడిగే వంశమే మనది. వాళ్లకి మనకీ ఎలా కుదురుతుంది అనుకున్నావు?”గర్జిస్తున్నట్లుగా అన్నాడు.
“నాన్న..ఈ రోజుల్లో కూడా ఇలాంటి పట్టింపులు ఏమిటి?
“ఆపు ..అధిక ప్రసంగం!” తండ్రి చేయి అనుపమ చెంపను బలంగా తాకింది.
* * **
గతం తాలూకు వేదన గుండెను కుదిపి వేస్తుంటే ఒక్కసారి గట్టిగా నిట్టూర్చి వర్తమానంలోకి వచ్చి పడింది అనుపమ. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సమీర్ ను వదులుకుంది. కానీ అతనికి అంకితమైన మనసును అలాగే స్వచ్ఛంగా,జీవిత పర్యంతం పదిలంగా ఉంచుకోవాలని నిశ్చయించుకుంది. ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా పెళ్లి చేసుకోను అని మొండికేసింది.
గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే గ్రూప్స్ రాసి ఏ సి టి ఓ గా సెలెక్ట్ అయి జాబ్ వచ్చిన చోట ఇల్లు కొనుక్కొని ఒంటరి జీవితం గడపడం నేర్చుకుంది. ఇక తన జీవితంలో మరో మగాడి ప్రస్తావన లేదు. సమీర్ ను కోల్పోయిన తన జీవితం అసంపూర్ణం.
బాల్యవస్థ నుంచి అందమైన కలలతో అపురూపంగా యవ్వనప్రాయంలోకి అప్పుడప్పుడే అడుగులు పెడుతున్న అమ్మాయి మనసు స్వచ్ఛమైన అద్దం లాంటిది. ఆ అద్దంలో తన మనసుకు నచ్చిన ప్రేమ పెన్నిధి రూపం ఆవిష్కరించబడగానే దానికి రూపు కట్టుకుంటుంది. తన గుండె లోతుల్లో శాశ్వతంగా ప్రతిష్టించుకుంటుంది.
మరొక మూర్తికి ఆ మందిరంలో ఎన్నటికీ చోటు అనేదే లేనంతగా తనను తాను అర్పించుకుంటుంది. ఆరాధిస్తుంది. అంతే తప్ప ఆ స్థానాన్ని మరొక వ్యక్తికి ఇవ్వడం అంటే తనను తాను ఆత్మార్పణ చేసుకోవడం గానే భావిస్తుంది.
ఒక్కసారి తన జీవితంలో ప్రవేశించిన వ్యక్తిని మరిచిపోయి మరొకరితో జీవితాన్ని పంచుకోవడం కంటే మించిన దౌర్భాగ్యం, ఆత్మవంచన మరొకటి ఉండదు. అలాంటి ఆత్మవంచనకు తను జన్మలో తావివ్వదు.
మరొకసారి తన దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని గట్టిగా రేపు అమ్మకు చెప్పేస్తాను.. మనసులో స్థిరంగా అనుకుంటూ వెనక్కి జారి దిండుపై తలవాల్చి పడుకుంది అనుపమ. ఆమె రెండు చేతులలో పదిలంగా పొదుపుకొని ఉన్న “ట్యూస్డేస్ విత్ మోరి” పుస్తకం ఆమె గుండెను మృదు మధురంగా స్పర్శిస్తూ ఉంది.
*** అయిపోయింది***
-మామిడాల శైలజ