సేకరణ

అమ్మకు సాయం చేయండి

అమ్మకు సాయం చేయండి.

ఆ కాలంలో అంటే మా బామ్మ ,అమ్మమ్మ , తాతమ్మ తరంలో మనిషోకో రకం ఐటమ్ వండటం లేదు .

ఒక కూర , పప్పు , పచ్చడి , రసము లేదా పులుసు (పెరుగు లేదా మజ్జిగ సిద్ధం చేసి ) ఒకేసారి వండేసి , దేవతార్చన చేసుకుని , వాళ్ళ వరకు విడిగా మడిగా తీసుకుని వంట గదిలో నుండి బయటకు వచ్చేసేవారు .

రాత్రికి అల్పాహారము ఏ ఉప్పు పిండో , దిబ్బరొట్టో వేసుకుని తినేసేవారు.

ఎవరైనా రాత్రి భోజనము చేసేవారుంటే , వారే వేడిగా ఏ కూర ముక్క లో వేయించుకుని , పొద్దున తినగా మిగిలిన పదార్ధాలు వేసుకుని వాటితో తినేసేవారు.

మరి ఈ కాలంలో మనిషికో రకం. భర్త తినేది పిల్లలు తినరు. అత్త గారు తినేది భర్త తినడు.పిల్లలు తినేది భర్త , అత్తగారు వేలేసి ముట్టుకోరు . వంట చేయడమంటే ఈ రోజుల్లో అంటే మహా యజ్ఞం చేసినట్లే.

ముఖ్యంగా పిల్లలు చాలామంది ఇళ్ళల్లో భోజనము చేయడానికి
చాలా పేచీ పెడుతున్నారు .

చచ్చి, చెడీ, మనిషో కో రకం చేసినా , తీరా భోజన సమయానికి పీజాలు ,
పానీ పూరీలు , కుర్ కురేలు లాంటి జంక్ ఫుడ్స్ బయట తినేసి ఇంటికి వస్తారు .

అమ్మ భోంచేయమనగానే , నాకాకలిగా లేదు, అన్నం వద్దని మారాం చేస్తారు .
ఈ మారానికి ఆడ మగ తేడా అనేదే లేదు .

పిల్లలంటే ఏ పదేళ్ళ లోపు వారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.

ఇంజనీరింగ్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ , డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకునే
యువతీ యువకులు కూడా ఇందులో ఏమీ మినహాయింపు కాదు.

వాళ్ళమ్మలకు తిండి దగ్గర ఎంత వరకు నరకం చూపించాలో….
అంత వరకు చూపిస్తారు .

రాత్రి 11 దాటినా అన్నం తినరు .

వండిన కూరలు అన్నం చూసుకుని తల్లి దిగులుపడి తినమని బ్రతిమలాడితే,
అమ్మ మీద దయ తలచి “అయితే మాకు ముద్దలు కలిపి పెట్టు. అలా పెడితేనే తింటాం ” అని అమ్మకు కండిషన్ పెడతారు.

పగలల్లా గొడ్డులా ఇంటి చాకిరీ సమస్తం చేసి , అర్ధరాత్రి దాకా అలిసి పోయి,
నిద్ర కళ్ళతో తూగుతూ అమ్మ ఈ పిల్లలకు ముద్దలు కలిపి నోట్లో పెట్టాలి .

ఈ ముద్దలు కలిపే ప్రహసనం రాత్రే కాదు ఉదయం కూడా…..
ఒక డిష్ లో కలిపిన అన్నం తీసుకుని, అమ్మ పిల్లల వెనక పిల్లలు స్కూల్ కు, కాలేజీ కి బయల్దేరే దాకా వారి వెనకాల పరిగెత్తుతూనే ఉంటుంది .

వాస్తవానికి భోజనము చేయడానికి ఎంత సేపు పడుతుంది ?

చాలా విశ్రాంతిగా తిన్నా 20 నిముషాలు మించి పట్టదు .

రోజు మొత్తములోని 24 గంటలలో 20 నిముషాలు భోజనము చేయడానికి సమయం పిల్లలకు దొరకదా? వారు ఆ 20 నిముషాల సమయాన్ని కూడా తమంతట తాము తినడానికి కేటాయించ లేరా ?

సమయం దొరకక పోవడానికి ప్రధాన కారణం , రాత్రి పది లోపు పడుకుని ఉదయం 5 గంటలకు లేవ వలసిన పిల్లలు , రాత్రి ఒంటి గంట దాకా
T.V. లో నానా చెత్త ప్రోగ్రాం లు చూసి, అప్పుడు పడుకుని, ఉదయం 8 గంటలు దాటాక లేచి , ఉరుకులు పరుగులు పెడుతూ “టిఫిన్ వద్దు , భోజనము వద్దు , లంచ్ బాక్స్ వద్దు టైం లేదు” అని నానా హడావుడి చేసి అమ్మను నానా హైరాన పెట్టేస్తారు .

తర్వాత వీళ్ళకు పెళ్ళిళై , ఉద్యోగాలకు పరిగెత్తుతూ, పిల్లల్ని కని అమ్మ నెత్తిన పడేసి , తమ సంతానానికి కూడా చాకిరీ చేసే అయాగా అమ్మను చేసేస్తారు.

మళ్ళీ అమ్మ కష్టాల కధ ప్రారంభం .

అప్పటికే ఆ తల్లులకు 60 దాటి పోయి వయస్సు పై బడి , శరీరంలో ఓపిక నశించి,
కాళ్ళ నెప్పులు , కీళ్ళ నెప్పులు , బి .పి, షుగర్ , ఆయాసం , నీరసం , గుండె దడ వంటి వ్యాధులతో పీడించబడి బాధపడుతూ చాకిరీ చేయలేక, చేయడానికి
ఓపిక లేదని ఎవరికీ చెప్పుకోలేక తమ లో తామే నా జీవితం ఇంతేనా ?
ఈ చాకిరీకి అంతం లేదా ? దేవుడా !! ఏం పాపం చేశాను ? అని శోకించిన తల్లుల గురించి కూడా నాకు తెలుసు. అలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని చాకిరీ చేస్తారు ?

ఈ బాధలు చాలవన్నట్లు , భర్త ఆఫీసు నుంచి లేటుగా విసుగ్గా వచ్చి అడుగుతాడు భార్యను ” పిల్లలు భోంచేసారా ? ” అని.
“ఇంకా తినలేదండీ ” అనగానే కారణం దొరికింది కనుక….
” పిల్లలకు అన్నాలు కూడా పెట్టకుండా ఇంతవరకు నువ్వు వెలగబెడుతున్న రాచకార్యమేమిటి ?” అని భార్య మీద ఇంతెత్తున ఎగిరి పడతాడు.
ఆ సమయానికి ఆ ఇల్లాలు అప్పుడే తీరుబడై ఏ T.V . నో చూస్తూ కూచుని ఉందనుకోండి , ఇక ఆయన ఉగ్ర నరసింహావతారం దాలుస్తాడు.

అంటే వేళకి భోజనము చేయని పిల్లల వల్ల మాటలు పడుతోంది….
మీ అమ్మ గారు. గ్రహించారా ?

మరి దీనికి పరిష్కారం –

తన తల్లి పడుతున్న కష్టాన్ని సంతానమైన అబ్బాయి కాని అమ్మాయి కాని గ్రహించాలి. అర్ధం చేసుకోవాలి.

తల్లికి సాయంచేసే విషయంలో ప్రతి బిడ్డా భాగం పంచుకోవాలి . వంటలో సాయం చేసే మాట దేవునికి ఎరుక. కనీసం మీ తిండి అయినా మీరు తినక పోతే ఎలా ?

25 ఏళ్ళు వచ్చినా డిగ్రీలు పూర్తయాక కూడా అమ్మ అన్నం ముద్దలు కలిపి
మీ నోట్లో పెట్టాలంటే ఆమెకు ఒంట్లో ఓపిక ఉండవద్దా ?

ఈ విషయాలు కూడా చదువుకున్న వారికి మరొకరు చెప్పాలా ?

మాకన్నా ఉన్నతమైన చదువులు చదువుతున్న వారు మీరు,
మీ అంతట మీరే ఆలోచించుకోండి.

-సేకరణ  బాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *