అమ్మకంలో నమ్మకం
జాలిలేకుండా నిజాలను
సమాజం సమాధి చేస్తుంటే
రోదించే మనసులను
నీరసించిన మనుషులను
ఆదుకునే తోడెవ్వరు ప్రభూ!
కర్కశకాలం
అబద్ధాలవాణిగా మారినవేళ
పోరాడే బతుకులు
యుద్ధాన్ని విరమించి నిస్తేజపు నావలో
దూరతీరాలకు సాగిపోతున్నాయి!
రేపటి వెలుగుల మాటేమో కానీ
నేటి చీకట్లను తొలగించేదెవ్వరు
తథాగతుడి మౌనంలా
సామాన్యుడి స్వరం మూగపోయింది
అపసవ్యం సవ్యం కానప్పుడు
అపస్వరాలే సప్తస్వరాలై
జీవన చిత్రాన్ని ఛిద్రం చేస్తుంటే
ఆశ నిరాశగా మారటంలో వింతలేదేమో!
నీడలు నిజాలు చెప్పవు
గోడలు ఆలంబన కావు
ఒంటి స్తంభం మేడలోని
ఒంటరి రాకుమారిలా
ఒంటరి పోరాటం చేసేందుకు
ఓపికనివ్వవా ప్రభూ
విభుడవు నీవని ప్రార్థన చేసినా
కనికరిస్తాడన్న నమ్మకమూ అమ్ముడు పోయినవేళ!
-సి.యస్.రాంబాబు