అమ్మ చీర

అమ్మ చీర

చందమామలో లీలగా కనిపించే బొమ్మలా కళ్ళల్లో అమ్మ
కళ్ళనిండా అమ్మ
కన్నీటి దుప్పటి తెరచాప కప్పుకుని
బతుకు పడవ ఈడ్చేసిన అమ్మ
సిగ్గే సిగ్గుపడేలా చీరతో కొంగు కప్పుకునే అమ్మ –
చిరుగు కనపడితే అత్తిపత్తి ఆకులా ముడుచుకుపోయే అమ్మ
కనుమరుగయ్యేంతవరకు చీర చిరుగుల్ని కనిపెట్టుకుని
బతికిన అమ్మ
అమ్మంటే దిష్టి తీసే ఉప్పు, మిరపకాయలు కలసిన
నిలువెత్తు ప్రేమ
దిష్టి పిడత మొఖాలు నా కొడుకునే చూస్తారు అని
రొమ్ము పాలు నాకొదిలి
కన్నీళ్ళను లోపలకు పీల్చుకున్న అమ్మ
చిలకడ దుంపల పచ్చడికి కొబ్బరిపచ్చడి పేరు పెట్టి
నోరంతా కన్నీటి లాలాజలం చేసే అమ్మ
అమ్మంటే వడియాల చీర
అమ్మంటే చిరుతిళ్ళకు పుట్టిల్లు
అమ్మంటే వెండి కడియాల కాళ్ళు
అమ్మంటే మాయమైపోయిన మెట్టెల వేళ్ళు
అమ్మంటే ముంగిట చెరగని ముగ్గు
అమ్మ అన్నం తిని పడుకుంటుందిలే నన్ను పడుకోబెట్టి అనుకునే అమాయకత్వం
చీకటి ఆకలికి నిద్రలో లేవాల్సొస్తుందని
కంచు గ్లాసులో నీళ్ళు పక్కనే పెట్టుకుని పడుకునే అమ్మ
అమ్మ చీర నాన్న వదిలేసిన కన్నీళ్ళకు చిరునామా
తడిసిన కొంగు నాన్న వదిలి వెళ్ళిన తడి ఆనవాలు
అమ్మ కన్నీటి గంగ కల్మషం లేకుండా పరుగులు తీస్తుంది
‘పర’ వశంగా
నాన్న వదిలి వెళ్ళిన నడిచే దేవాలయం అమ్మ
నిలువెత్తు కన్నీటి బొమ్మ
చీకటి కొమ్మ
అమ్మ అక్షరాలా నుదుటి మీద చిరునవ్వు చెరిపెళ్ళిపోయిన నాన్న రాసిన కన్నీటి కమ్మ!

-గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *