అంబేద్కర్. ఓ ఆదర్శం!
పాలాభిషేకం ఒక పార్టీ చేస్తే
పుష్పాభిషేకం చేసింది ఇంకో పార్టీ
ఏకంగా విగ్రహం రంగే మార్చింది మరోపార్టీ!
‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్’ అని నాలుక తిరుగని నాయకుడు
నలభై నిమిషాలు స్పీచిచ్చిండు దేశం గురించి!
మావాడంటే మావాడని
నడిబజారుల బట్టలు చినిగేటట్టు కొట్టుకున్నరు ఆఖరికి!
గదిజూసి పరేషానైన పిల్లలు
జయంతి, వర్థంతిలకు మాత్రమే గుర్తొచ్చే
విగ్రహం గురించి కాకుండా
ఆచరించదగ్గ అంబేద్కర్ ఆశయాల గురించి
నాలుగు మాటలు చెప్పమన్నరు!
మహాసముద్రమంత లోతు
మహోన్నత శిఖరమంత గొప్పతనం గల దార్శనికుడి గురించి
నాలుగు రోజులు నాన్ స్టాపుగ చెప్పినా సరిపోదని
అనుకుంటూనే…ఇట్ల చెప్పిన!
అగ్రకులాల అహంకారపు సమాధుల మీద ఎగిరిన జెండా అంబేద్కర్
పోరాడటం,ప్రశ్నించడమే అజెండాగా జీవించిన యోధుడు
మనిషిని మనిషిగా చూడని మతవిశ్వాసాలపై ఝుళిపించిన కొరడా
అంటరానితనాన్ని కూకటివేళ్లతో పెకిలించిన గండ్రగొడ్డలి
అసమానతలపై ఉప్పెనలా ఎదురుతిరిగిన ఉద్యమకారుడు
అణగద్రొక్కబడిన, అణగారిన వర్గాల ఎత్తిన పిడికిలి అంబేడ్కర్
అంబేద్కర్ అంటే ఓ సిద్ధాంతం
అంబేద్కర్ అంటే ఓ ఆదర్శం!
ప్రజల గుండెల్లో నిలిచిన యుగపురుషుడు
రాజ్యాంగాన్ని రచించిన భారతరత్నం
అందరివాడు అంబేద్కర్!
-గురువర్ధన్ రెడ్డి
అంబేద్కర్ అమర్ రహే