అలుపెరుగని బాటసారి

అలుపెరుగని బాటసారి

సరస్వతి కొత్తగా పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్ళింది. ఆమె పెళ్లి కాస్త వింతగానే జరిగింది.సరస్వతి పిన్ని నీ చూడడం కోసం వచ్చిన పెళ్లి కొడుకు సరస్వతి నీ ఇష్టపడడం తో ఇక తప్పక పెళ్లిచేశారు.పెళ్లికి నాలుగు వేల కట్నం, సారే పెట్టీ పంపారు. కానీ అక్కడికి అంటే అత్తారింటికి వెళ్ళాక తెలిసింది అతనికి ముందే పెళ్లి అయ్యిందని.ఆ విషయం తెలిసిన పెద్దలు వచ్చి మాట్లాడారు ముందే ఎందుకు చెప్పలేదు అని.

ఆమె నే వదిలేసి వెళ్ళింది కాబట్టి చెప్పలేదు.ఆమె అంగీకార పత్రం రాసిందంటూ చూపించారు అత్తామామలు. దాంతో పెద్దలు మా అమ్మాయి జాగ్రత్త అంటూ చెప్పి సరస్వతికి అన్ని విధాలా నచ్చచెప్పి వెళ్లారు. పెద్దలు చెప్పినట్టు చేయడమే కానీ సరస్వతికి ఎదురు చెప్పే ధైర్యం లేదు.ఎందుకంటే తన తర్వాత ముగ్గురుచెల్లెళ్ళు ఉన్నారు మరి. నోరు మెదపకుండా ఉండిపోయింది సరస్వతి. మొదటి రాత్రి భర్త తాగి వచ్చి ముట్టుకున్నా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది.

తెల్లారగానే కొత్త కోడలు అనేది లేకుండా అత్తగారు అయిదు గంటలకే చీపురు చేతికి ఇస్తూ ఇక ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి అంటూ ఆర్డర్ వేసినా. కిమ్మనకుండా చీపురు అందుకుంది.

ఇక అప్పటి నుండి మొదలు నలుగురు మరుదులు, నలుగురు మరదళ్ల, అత్తా, మామ ,ఇంటికి వచ్చి పోయే చట్టాలకు వండివార్చడం, అది కూడా కట్టెల పొయ్యి తో వర్షాకాలం లో కూడా నాలుగు పూటలా రెండు డేగిషాల నిండా వండుతూ, రొట్టెలకోసం ఈస్సురవుతు లో బియ్యం ఆడించి బియ్యపు రొట్టెలు చేయడం ,కట్టెలు కొట్టుకోవడం , మిరపకాయలు ఎండబెట్టి పొడి చేసుకోవడం , ఊరగాయల కాలం వచ్చిందంటే వెయ్యి కాయలు పెట్టించేది అత్త.

సరస్వతి వెళ్ళాక మరదల్లకు , మరుదులు పెళ్ళిళ్ళు చేసింది. అత్తారింటికి లో ఎది చేసినా మరదళ్లకు పంపాల్సిందే . అలా నోరు మెదపకుండా అన్ని పనులు చేస్తూ ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది సరస్వతి. ఆమె భర్త ఉద్యోగ రీత్యా వేరే ఊరు బదిలీ అవడం తో సరస్వతిని వండి పెట్టడానికి తీసుకుని వెళ్ళాడు. పిల్లలతో పాటు సరస్వతి ఇంట్లోంచి మొదటి సారి గా కాలు బయటకు పెట్టింది.

అయినా ఏం లాభం భర్త అనుమానం మనిషి కావడం తో దినదిన గండంగా మారింది సరస్వతి బతుకు. పిల్లలున్నారు అనే ఇంగితం కూడా లేని భర్త చీటికి మాటికి అనుమానించి కొడుతూ ఉండేవాడు. అవన్నీ సరస్వతి భరించింది ఎందుకంటే తానూ చనిపోతే ముగ్గురు పిల్లలు అనాధలు అవుతారనుకుంది. పుట్టింటికి ఎప్పుడూ పంపేవాడు కాదు. వాళ్ళు వచ్చినా ఏదో ఒక గొడవ పడుతూ పంపించేవాడు.

కాలంతో పాటు పిల్లలు పెరుగుతూ వచ్చారు.. తోటి ఉద్యోగులను చూసి భర్త మారే సమయం లో విధికి కన్నుకుట్టి అతను హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. ముగ్గురు చిన్న పిల్లలతో సరస్వతి ఒంటరి అయ్యింది. అప్పటికి బయట ప్రపంచం చూడని సరస్వతి కి ఏం చేయాలో తోచలేదు. వచ్చిన చుట్టాలు, అత్తగారు చేతులు దులుపుకున్నారు.

దిక్కు తోచని స్థితిలో సరస్వతి మేనమామ ఆమె దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తూ, ఆమె ఎప్పుడో నేర్చుకున్న క్రాఫ్ట్ విషయాన్ని గుర్తు చేస్తూ నువ్వెందుకు ఆ పనిని ఉపాధిగా చేసుకోకూడదు అనగానే దానికి డబ్బు, మెటీరియల్ కావాలి నలుగురికి తెలియాలి అంటూ సందేహం వెలిబుచ్చింది. దానికి మేనమామ ముందు ఇంట్లో ఉన్న వాటితో ఏదైనా తయారు చేసివ్వు నేను నీకు సాయం చేస్తాను అన్నారు.

అలాగే ఒక కుట్టు మిషను సెకండ్ హ్యాండ్ లో కొన్నారు పుస్తెలు అమ్మి. ఇక సరస్వతి చిన్నగా జాకెట్లు కుట్టడం, క్రాఫ్ట్ చేయడం మొదలు పెట్టింది. అది మెల్లిగా పుంజుకుంది. దాంతో సరస్వతి వెనుదిరిగి చూడలేదు. ఇప్పటికీ సరస్వతి అలుపెరగని బాటసారి లా పయనం సాగిస్తూనే ఉంది. ప్రతి ఒక్క మహిళ కథ ఇది

– భవ్య చారు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *