అలజడుల స్మృతి గీతాలు

అలజడుల స్మృతి గీతాలు

గజల్ గాయనిగా జ్యోతిర్మయి మళ్ల మనకు సుపరిచితులు. కవితాత్మక కథనంతో బాల్య స్మృతులుగా కొద్ది కాలం కితం ఆవిష్కరించిన వారు ఇటీవలే కథల పుస్తకాన్ని వెలువరించారు.

మొత్తం పదిహేను కథలుంటే వాటిలో ఎనిమిది కథలు రోజుకూలీల జీవితాల కష్టాలను, కడగండ్లను చూపుతాయి. భావం, శైలిలకు సమన్వయం కుదిరితే ఆ కథ మంచి కథవుతుందంటారు విమర్శకులు. ఆ సమన్వయం చాలా కథలలో కనిపిస్తుంది. చెమటచుక్కలను సిరా చేసి రాసినట్టనిపించే కథలివి. ఎక్కువ కథల్లో వృద్ధుల వెతలు కనిపిస్తాయి.

అందుకు కారణం నిరాశ్రయులయిన ఎందరో పెద్దవారిని తమ తల్లి ఆశ్రయమిచ్చిందని, వారి వెతలే కథలుగా ప్రాణం పోసుకున్నాయంటారు రచయిత్రి. శ్రీకాకుళం యాస తీయగా పలకరిస్తుందీ కథలలో. మోతాదుకు మించిన నాటకీయత, సినిమాటిక్ మలుపులు లేకుండా సహజంగా కథలివి.కథల్లోని పాత్రలతో మనమూ ట్రావెల్ చేస్తాం.

మొక్కజొన్న పొత్తులు కొంటామేమోనని ఎదురు చూసే మనుషులు రైల్వే క్రాసింగ్ ల వద్ద, బస్టాండ్ల్లోను తారసపడుతుంటారు. మనమేమో నిర్లక్ష్యంగా బేరమాడుతుంటాము. అలాంటి జీవితాల విషాదాన్ని రాజమ్మ పాత్రతో చిత్రిస్తారు రచయిత్రి రైలెల్లిపోనాది కథలో. తప్పకుండా బేరమాట్టం మానేస్తామిక ఈ కథ చదివితే.

మనం చూడటానికి నిరాకరించే అథోజగత్ సోదరులు, సోదరీమణులను వెతికి పట్టుకొని చూపిస్తారు రచయిత్రి. తను పడిన బాధలు తన కూతుళ్లు పడకూడదని కలలు కనే పోలమ్మ (పోలమ్మ) తమలాంటి బండ బతుకులకు దివిటీ చదువనుకునే సోనమ్మ (దివిటీ) లు ఒకలా ఉంటే మందు కథలో వెంకటమ్మ చదువు తన పిల్ల జీవితానికి అడ్డనుకుంటుంది.

చిన్న నీసు ముక్క కోసం కళ్ళను గుమ్మానికి కట్టేసిన పైడితల్లి (నేనింకా బతికే ఉన్నా)
కరోనా కాలంలో వలస కార్మికుల నడక దుఃఖం (నడక ఆగింది)
మనలను కదిలిస్తాయి..తమతో నడిపిస్తాయి,ఈ కథలు, కథలలోని పాత్రలు.

కథెప్పుడూ మనిషిని వికాసం వైపు నడిపించాలి.అలాంటి భావన మౌనపాఠం కథ కలిగిస్తుంది. చకచక నడకతో సాగే ఈ కథ ఇప్పటి యువతకు దారిచూపుతుంది.ఒక కుటుంబంలో ఆత్మహత్య కలిగించే క్షోభను సంఘటనల రూపంతో చర్చిస్తుంది. ఇలా ప్రతి కథలో ఓ ప్రత్యేకత ఉంది. ముందే చెప్పకున్నట్టు వస్తువుకు, శైలికి సమన్వయం కుదిరిన కథలివి.

ప్రతి కథ ఒక జీవన శకలమై మనలను పలకరిస్తుంది మనసు పొరల్లోకి దూరిపోయి అలజడిని సృష్టిస్తుంది. ఒక కథాశీర్షికతో కాకుండా జ్యోతిర్మయి కథలు గా పుస్తకాన్ని వెలువరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు రచయిత్రి. వారికి అభినందనలు…. 

– సి. యస్ రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *