అక్షరం
ఎందుకో ! తెలియకుండానే ఈమధ్య అక్షరాలని తెగ ప్రేమించేస్తున్నాను….
అప్పుడెప్పుడో భూతంలో చీకటిలో ఉన్నప్పుడు అక్కున చేర్చుకున్న అక్షరాలపై అప్రయత్నం గా ఆకర్షణకు లోనయ్యాను..
బేలగా బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నప్పుడు
భయపడొద్దని భరోసా ఇచ్చి
ఇరుల నుండి వేలు పట్టి నను వెలుగులోకి నడిపించిన
అక్షరాలను అమాంతంగా ప్రేమించేశాను..
ఆ అక్షరాల చుట్టూ తపస్సు చేస్తున్నాను.
ఏనాటికైనా ప్రేమతో ఆ అక్షరాలు నన్ను అక్కరకు చేర్చుకోపోతాయా!
అవే అక్షరాలు నా హృదయాన్ని తడిమి ఆర్ద్రత తో తడిపి సాహిత్య భావజాలాలను మొలకెత్తిస్తాయి..
తన్మయత్వపు తీగలు మేని పందిరంతా అల్లుకుని పెదవిపై మొలక నవ్వులు వికసింప చేస్తాయి…
అందుకే వాటితో పీకల లోతు ప్రేమలో కూరుకుపోయాను…
వలచి వచ్చానని అలసు కాబోలు..
నాతో అంటీ ముట్టనట్టు ఉంటాయి..
దూరం నుండే ఊరిస్తాయి..
గోపికలతో రాసలీలలాడిన కృష్ణుని చూసి అసూయపడిన రాధలా
వేరే వాళ్ళ చెంతనున్న అక్షరాలని చూసి నేనూ అంతే అసూయపడతాను..
ఈసులో కూడా అవి ఇంకా ఇంకా ఆకర్షణకి గురి చేస్తూ నన్ను కవ్విస్తూ ఉంటాయి..
ఆ అచ్చరాలను ముచ్చటగా ముద్దాడుతూ
నా అంతరంగ విన్యాసాలకి తగిన స్వరజతులను కూర్చుకోవాలనుకున్న ప్రతిసారీ
కాలయముడు కన్నెర్ర చేసి నా కనులపై బద్దకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు..
నేను అక్షరాలను ప్రేమిస్తే అది నన్ను ప్రేమిస్తుంది.
ఈ త్రిమూల ప్రేమ కథకు
ముగింపు పలికేదెప్పుడో..
ఈ ప్రతిబంధకాలకు నీళ్లొదిలేదెప్పుడో…
నేను ప్రేమించే అక్షరాలకు ఎప్పుడు మరింత దగ్గరవుతానో..
ఎన్నో భావాలను గూడు కట్టుకుంటున్న
ఈ గొంగళి పురుగును అక్షరాల రెక్కలతో సాహిత్య సీతాకోకగా ఎప్పుడు ఎగరేస్తాయో?….
జ్ఞాన వినీలాకాశంలో అక్షర నక్షత్రమాల ఎప్పుడు నా మెడను వరిస్తుందో..
అక్షరానికి నన్ను జత చేయమని కాలాన్ని ప్రేమగా మచ్చిక చేసుకుని మరీ బ్రతిమాలుతున్నాను.
ఎప్పుడు కనికరిస్తుందో?
జాలిపడి కనికరిస్తుందో తిరిగి కాటేస్తుందో…..
– సలాది భాగ్యలక్ష్మి