అక్షర_భావాలు
కొన్నే..అక్షరాలు..
కోటి భావాలు..
అక్షరానికి అక్షరం చేరిస్తే పదం..
పదాలకు భావుకత జోడిస్తే కవిత్వం..
పదం పదం కూరిస్తే భావ రంజని..
భావాలు మౌనం వహిస్తే భాష్ప వర్షిణి..
భాష మూగబోయినా..
అక్షరం స్రవించకమానదు..
కన్ను చెమరిస్తే విరహంగా..
అధరం మురిస్తే ప్రణయంగా..
అక్షరాలకు చెప్పే భాష్యంగా…
కవిత్వమంటే రాతలేకావవి..
ఆరబెట్టిన అక్షరాలు కావవి..
పారబోసిన దోసెడు మాటలసలేకావవి..
గుండెల్లో కువకువలూ..
గుండెలవిసే రోదనలూ..
విరబూసి విరిసే సుమాలూ..
ఎగజిమ్మి దహించే అగ్నికణాలూ..
మనసు భావాలకు కవితా ధారలు..
కవితకాలంబన అక్షరాలు..
మనసున్నంతకాలం అక్షరాలు
కరుగుతూనే ఉంటాయి.
-గురువర్ధన్ రెడ్డి