అక్షర కళ్ళాపి
శుభ్రంగా ఊడ్చిన
వాకిలా వున్న
తెల్లకాగితంపై
అక్షర కళ్ళాపీ చల్లుతుంటే
ఆర్పుతూ పోతున్నాయు
పెను వేగంగా వీచే
విఙానపు వీచికలూ
కాలం మళ్ళీ
నిఘూడ రహస్యాలను
విడిచి వెళుతూనే వుంది
మనసు చెంబుకు
భావాల అరచేతు లడ్డు పెట్టి
ఎంత అక్షర కళ్ళాపీ చల్లినా
అంతగా నా అజ్నానం
రికార్డు చేయబడు తూనే వుంది
అయునా ఎందుకో
ఆపాలని లేదు
నే బతికిన కాలాన్నిపట్టి
అగ్గిపెట్టెలో పెట్టి
ముందు తరాలకు అందించాలని
అవసర మయునప్పుడు
వాళ్ళే మండించి
పండించుకొంటారని
కాలంపై నిర్మించబడ్డ
సమాజ సౌధపు
పునాది రాళ్ళను
పునఃపరిశీలించు కొంటారని
వాక్యం పూర్తయ్యేలోపే
కొత్త అర్ధాలు విరగ కాస్తున్నా
ఒకప్పటి వాక్యాలుగా నన్నా
వ్యాక్యానించబడతాయని
అక్షర కళ్ళాపీ ఆపకుండా చల్లుతూనే వున్నా
మనసును మాటలుగా మార్చి రువ్వుతూనే వున్నా…
-గురువర్థన్ రెడ్డి