అక్షర ఫిరంగులు
ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుకొని
జ్ఞాపకాల ప్రవాహం లొంచి కొట్టుకు వచ్చిన
నాలుగు వాక్యాలను ఏరుకొన్నాను
గణుపులున్న చొటా వంకర్లున్న వద్దా
పొయ్యుకి అనుకూలంగా వుండేందుకు
వంట చెరుకును విరిచినట్టు
అర్ధం చెప్పాల్సిన దగ్గరో
ఆనందం పంచాల్సినప్పుడో
ప్రశ్నను వదలాల్సిన వద్దనో
వేదన వినిపించాల్సిన చోటనో
వాక్యాలను జాగ్రత్తగా తుంపినాను
ప్రతీకలతో పదిలంగా చుట్టి నాను
మనసును మాటల్లో పోసి
అవసరమై నప్పుడు మార్మికథ అద్దినాను
అవి
వంతెనులగానో
మెట్ల వరుసలగానో
వీణియ తంత్రులుగానో
బాణాల సంచులగానో
అమర్చుకొని
భావాలను పండిస్తున్నాయు
అవే
దాటించాల్సినవి దాటిస్తున్నాయు
ఎక్కించాల్సినవి ఎక్కిస్తున్నాయు
వినిపించాల్సినవి వినిపిస్తున్నాయు
సందించాల్సినవి సంధిస్తున్నాయు
వచన కవిత్వాన్ని వండివడ్డిస్తున్నాయు
అక్షర అలిపిలో కవితాఘర్షణలో
కాక్టైల్ అయున భావాలను
తాగేసి మత్తెక్కినాను
అక్షర కుసుమాలను
మాటల మాలలుగా అల్లుకొంటూ
కవితా పంక్తులుగా పేర్చుకొంటూ
దాహం తీర్చుకొంటున్నాను
అక్షర అక్షౌహిణీలు నా పక్కనున్నాయు
అయునా
భావ కురుక్షేత్రంలో
అర్ధరధుడినన్నా కాలేకపోతున్నాను
అప్పుడప్పుడు
భావం భాస్వరమైనప్పుడు
అక్షర ఫిరంగులు లక్షణంగానే మ్రోగుతున్నాయు
లోపల ఎక్కడో కవిత్వ గంటలు నిత్యం వినిపిస్తూనేవున్నాయు..
-గురువర్థన్ రెడ్డి