ఆకాశంలో తార
నాన్నంటే నిత్యవసర వస్తువు
అన్నాడో కవి
నిజమేనేమో
నీ సుఖంలో తన కష్టం మరచిపోతాడు
నీ నవ్వులో తన బాధని దాచుకుంటాడు
నువు తొలి అడుగేసిన రోజున
ఎవరెస్ట్ ఎక్కినంత సంబరపడతాడు
నీ విజయంలో తన వైఫల్యాన్ని తరిమేసి
ఒలింపిక్ మెడలొచ్చినంత వేడుక చేస్తాడు
నీకు కష్టమొస్తే సృష్టిలోని దేవతలందరికీ మొక్కుతాడు
నీకు నొప్పి కలిగితే తను లేపనమవుతాడు
నువ్వు ప్రయోజకుడివై
జయకేతనాన్ని ఎగురవేస్తే
ఊరంతా చాటింపు వేస్తాడు
నువ్వూ నాన్నహోదాపొంది కంగారుగా అటుఇటు పరిగెడుతుంటే
తను చిన్నపిల్లాడైపోతాడు
నీ తీపిగుర్తులతో తను వేడుక చేసుకుంటాడు
ఇవన్నీ నీకు తెలిసేసరికి
తను ఆకాశంలో తారలా మిగిలిపోయి
నిను దీవిస్తుంటాడు
ఒక కన్నీటి బొట్టు
నిను వెచ్చగా పలకరిస్తుంటుంది
Happy Father’s day
-సి.యస్.రాంబాబు