ఆగ్రహం అవివేకానికి చిహ్నం
‘కోపగ్రస్తుడు నోరు తెరుస్తాడు
కానీ కళ్ళు మూసుకుంటాడు’ అన్నారు ఒక రచయిత.
కోపం ఒక తీవ్రమైన సమస్య మనలో చాలామందిని ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే సమస్య ఇది. కోపం వల్ల ఎన్నో దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది ఇటు కోపగించుకున్న వ్యక్తికి బాధ కలుగుతుంది అటు కోపానికి గురైన వ్యక్తికి పాదా అవుతుంది కోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి అధిక రక్తపోటు పెరిగి ఉద్రేకంతో అనేక శారీరక సమస్యలు ఒక్కోసారి గుండెపోటుకు కూడా దారి తీయవచ్చు. తీవ్రమైన కోపంలో ఉన్న వ్యక్తి విచక్షణాజ్ఞానం కోల్పోతాడు. ఏది మంచి ఏది చెడు గ్రహించే జ్ఞానం తాత్కాలికంగా మరుగున పడిపోతుంది. కోపం అనేది తాత్కాలికమైన ఉన్మాదం లాంటిది. కాబట్టి ఇన్ని అనర్ధాలు ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించడం ఎంతో మేలు.
కోపంతో అన్న మాటలు ఎదుటి వ్యక్తిలో చాలా కాలం తిష్ట వేసుకొని ఉంటాయి కోపం వల్ల చక్కటి అనుబంధాలు కూడా బీటలుబారి పోతాయి. కోపంతో ఉన్న వ్యక్తి వెనక ముందు ఆలోచించకుండా ఎంతమాట పడితే అంత మాట అనేస్తాడు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? కోపం ఉన్నచోట మనిషిలో ఎదుగుదల కుంటుపడుతుంది. కోపం మనలో ప్రవేశించే ఒక శక్తివంతమైన శత్రువు.
సాధారణంగా మనకన్నా అధికారంలో, బలంలో, వయస్సులో తక్కువైన వారిపై కోపం ప్రదర్శిస్తాం. మనకన్నా అధికారంలో, బలంలో ఎక్కువైన వారిపై కోపం వచ్చినా నియంత్రించుకుంటాము. అంటే ఇక్కడ కోపాన్ని ప్రదర్శించే తీరు మారుతుంది. అవసరమనుకున్న చోట కోపాన్ని ప్రదర్శించడాన్ని నియంత్రించుకోగలమన్నమాట. క్రమక్రమంగా ఇదే పద్ధతిని అన్ని పరిస్థితులలోనూ అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. కోపం అందరి మనసులోనే ఉంటుంది కానీ దానిని ప్రదర్శించే తీరు మనిషికి మనిషికి వేరుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోపము ద్వేషంగా, పగగా మారే అవకాశం ఉంది.
‘కోపాన్ని మనసులో దాచుకోవడం ఇతరుల మీదకు విసిరేందుకు కనకనలాడే నిప్పును చేతుల్లోకి తీసుకోవడం లాంటిదే’ అంటారు బుద్ధుడు. కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. క్షణికావేశం అంతులేని అనర్ధాలకు దారి తీస్తుంది ఎదుటి వ్యక్తి పై ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత క్షమాపణ చెప్పిన వారిపై పడిన ప్రతికూల ప్రభావం పూర్తిగా పోతుందనుకోవడం పొరపాటు. కాబట్టి ఆవేశానికి లోను కాకుండా అప్రమత్తంగా ఉండడమే మంచిది.
బాగా కోపంగా ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడే ముందు మొదట బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. కాసేపు ఆగండి. మీ కోపం తీవ్రత తగ్గిపోయిన తర్వాత అప్పుడు మీరు చెప్పాలనుకున్నది ఏమిటో నిదానంగా చెప్పండి. మీ కోపం మీ మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని మింగేయకుండా చూసుకోండి. కోపం తగ్గించుకోవడానికి ఆ సమయంలో నిశ్శబ్దాన్ని పాటించండి. కోపం వచ్చిన ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోండి. నచ్చిన జోకులు,హాస్య సంఘటనలు గుర్తు చేసుకోండి. మీకు కోపం తెప్పించిన వ్యక్తి మీకు ఎంత మంచి ఆప్తుడో గుర్తు చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా కోపం అదుపులోకి వస్తుంది.
-మామిడాల శైలజ