ఆడుకొనేఆటబొమ్మగా
ఏమని రాసాడో ఆ బ్రహ్మ…
అర్థంకాని బతుకు సంతలో బానిసగా
బతుకెల్ల దీస్తున్నాను…విధి పాయని
సంకల్పాలు వాడిన అలంకారాలై చూచే
చూపులు బాకులై మెడలను కోస్తున్నాయి
ఈ విపత్కర పరిస్థితులలో అబల సబలౌనా
తలచిన ఆశయాలు నెరవేరునా…
కళ్ళుండి చూడలేనిది చట్టమని…
మబ్బులు కప్పుకొన్న న్యాయధర్మాలు
పిడికిలికి దొరికిన తూలనంతో ఎటువైపు
వాలుతున్నదో తెలియని తరుణంతో
మానవీయతలు మట్టి కరిచి పోతున్నవి…
వ్యవహారం వ్యక్తం కాలేని మనస్సుతో
చీకటి కరిచిన గాయంగా మహిళా లోకం
మచ్చబారుతు…లోకాన అణుకువ కొద్ది
ఆడుకొనే బొమ్మగా మిగిలింది….
అర్ధరాత్రి స్వతంత్రమా….ఎందుకు
నీవు చీకటితో ప్రారంభమయ్యావో
తెలియదు….రాయని పర్వంతో
రాజ్యమేలుతు పూయని మా బతుకుల
స్వచ్ఛత కామాంధులు రాసిన పూనకమై…
అడుగడుగున మహిళా తాత్వికాలు
కీర్తించబడక…కిరీటంలేని మొండి తలతో
ఊరేగిస్తు మారని మనుషులతో ఇంకా
ఎన్నాళ్ళని మోయాలి అంధారం లేని
మోతని…
స్వాతంత్ర్య మొక ధ్యేయమని…
వేచిన అడుగులు గాంధీజీని నడిచాయి…
మన్నింపు లేని మా బతుకుల
భవితవ్యం నిర్వేదం రచించిన గాఢ్సేలను
అనుసరిస్తున్నాయి…అనాధి నుండి
అకృత్యాలు సదాచారాలుగా నీతి శాసనమై
భోదపడుతుంటే మహిళగా పుట్టిన
గడ్డమీద జాతిని నిలబెట్టుకోలేని దుస్థితిలో
కంచె మేసిన చేనుకు దిక్కెవరనే…
స్వార్థమా….సరిచేసుకోలేని నిరంతరమా
కోవెలలేని నిత్య సహన శీలికి
ఇది శాపమా….
-దేరంగుల భైరవ