అదృష్టం
లావణ్య ఒకసారి మనసులో గట్టిగా దేవుడికి దణ్ణం పెట్టుకుని లోపలికి అడుగులు వేసింది. ఆమె ఒక ఇంటర్వూకి వెళ్తుంది. చేసేది పెద్ద ఉద్యోగం కాకపోయినా ఆమెకు ఇప్పుడు అదే పెద్దగా అనిపిస్తుంది.
లాక్ డౌన్ లో ఉన్న ఉద్యోగం పోయింది. అదిగో అప్పుడే తన భర్త కూడా తనను వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఇప్పటికీ జాడ లేదు. ఎంతో వెతికింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా ఫలితం శూన్యం. ఎం చేయాలో అర్థం కాలేదు.
పైగా చుట్టూ ప్రక్కల ఉన్నవారు మాటలతో హింసించారు. నువ్వే ఏమన్నావో అందుకే వెళ్ళిపోయాడు అంటూ కాకుల్లా పొడిచారు. అలా వెతుకుతూ ఆరునెలలు ఇట్టే గడిచిపోయాయి. అతని జాడ కనిపించలేదు. ఇంట్లో ఉన్న, దాచుకున్న డబ్బులు కూడా అయిపోయి, తిండికి కూడా లేని పరిస్థితి.
ఏం చేయాలో తెలియక ఎందరినో పని కోసం అడిగింది. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఎందుకంటే కరోనా తర్వాత ఒకర్ని ఒకరు పట్టించుకోవడం మానేశారు. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఉసూరుమంటూ ఉన్న సమయంలో ఇదిగో ఇప్పుడు మొదలవ్వబోతున్న ఒక మార్ట్ లో పని ఉందని తెలిసి అడగాలని వెళ్ళింది.
లోపలికి వెళ్ళగనే అక్కడ ఒకతను కనిపించారు. సర్ ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా అంటూ అడిగింది. ఎవరికమ్మా పని అంటూ అతను అడిగాడు. నాకే సర్ ఏదైనా పని ఉంటే చెప్పండి అంటూ అడిగింది.
ఏం చదువుకున్నారు అంటూ అడిగాడు ఎక్కువ చెప్పకూడదు అని ఇంటర్ సర్ అంటూ చెప్పింది. సరే అమ్మా ఇక్కడ పని ఉంది. రేపు నీ సర్టిఫికెట్ లు తీసుకుని రా అంటూ చెప్పాడు అతను.
అబ్బా పని దొరికింది అంటూ లావణ్య సంతోషించింది. అలాగే సర్ అంటూ మనసులో సంతోషం ఉప్పొంగుతుండగా వెనుదిరిగి వెళ్ళింది ఇక తన ఇద్దరు పిల్లలను పస్తులతో ఉంచే పరిస్థితి పోయింది అనుకుంటూ తెల్లారి వెళ్లి సర్టిఫికెట్ లు అన్నీ ఇచ్చింది. ఇక ఈ రోజు నుండి నువ్వు జాయిన్ అయినట్టే అమ్మా అంటూ చెప్పాడు అతను.
అలా పని లేని లావణ్య కి అనుకోకుండా ఉద్యోగం దొరికింది అది కూడా పదివేల రూపాయల జీతం తో అదృష్టం వరించింది లావణ్యకు ఇక ఇప్పుడు భర్త లేకపోయినా, రాకపోయినా తన పిల్లలను చూసుకుంటూ జీవితాన్ని గడపగలదు లావణ్య.
– భవ్యచారు