అభిలాష
నేను పదో తరగతి పాస్ అయ్యాక ఏ కాలేజీలో చేరాలి అనే సమస్య మొదలైంది. దగ్గరలో ఏ కాలేజీ లేదు. కాలేజికి వెళ్ళాలంటే పక్క ఊరికి వెళ్లాలి. అందువల్ల నాన్న గారు పక్క ఊర్లో ఏదైనా మంచి కాలేజీ ఉందేమో అని వెతకడానికి వెళ్ళారు ఒక రోజు.
అయితే అక్కడ రెండు కాలేజికి ఉన్నాయి. అందులో నాన్నగారికి తెలిసిన ఒకరి కాలేజీ బాగా అనిపించింది. దాంతో అప్లికేషన్ ఫామ్ తెచ్చారు. తెల్లారి అది నింపేసి నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళాం ఇద్దరం.
అప్పటి వరకూ పక్క ఊరికి ఎప్పుడు వేళ్ళని నేను అదే మొదటి సారి వెళ్ళడం కావటం చేత అన్ని వింతగా చూస్తూ ఉన్నాను. అది కొంచం పెద్ద ఊరు కాబట్టి అన్ని కార్యాలయాలు అక్కడే ఉన్నాయి.
ఇక నన్ను నాన్న గారు ప్రిన్సిపల్ కి చూపించి మా అమ్మాయి బాగా చదువుతుంది అంటూ చెప్పారు. ఫీజు కూడా కట్టారు.
అప్పటికి మాత్రం ఒక నోట్ బుక్ తీసుకుని క్లాస్ లో కూర్చోమని చెప్పి నాన్న రావడానికి నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు అంతా కొత్తగా, బిడియంగా అనిపించింది.
క్లాస్ లోకి వెళ్ళాను అక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ లేరు. ఎనిమిది మంది ఉన్నారు. నలుగురు అమ్మాయిలు నాతో కలిపి, మిగతా వారు నలుగురు అబ్బాయిలు.
ఇక నన్ను చూడగానే అమ్మాయిలు చిరునవ్వుతో నాకు వెల్కమ్ చెప్పి పక్కన చోటు ఇచ్చారు. ఇంతలో క్లాస్ లోకి సార్ వచ్చారు. అందరం లేచి నిల్చున్నాము.
సార్ లోపలికి రావడంతోనే నవ్వుతూ ఏంటమ్మా కొత్తగా భయంగా ఉందా? ఇప్పుడు అలాగే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మీకు అలవాటు అవుతుంది.
ఇంతకీ మీ పేరు ఏంటి నా పేరు అయితే భాస్కర్. నేను మీకు ఫిజిక్స్ చెప్తాను అంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు.
ఆ తర్వాత మీ పేరు చెప్పండి అంటూ అబ్బాయి నుంచి మొదలు పెడదాం అంటూ అబ్బాయిలు ఒకర్ని లేపారు. అతను తన పేరు చెప్పి తాను ఎక్కడ నుంచి వచ్చేది చెప్పి కూర్చున్నాడు.
అలాగే అందరిని అడిగి చివరి అబ్బాయి దగ్గరికి వచ్చాడు ఆ అబ్బాయి పేరు అడగగానే నా పేరు జహంగీర్ సార్ అని చెప్పాడు. మేమందరం అతని వైపు చూశాను.
అతను చాలా తెల్లగా మామూలు హైట్ తో ఉన్నాడు ఇలాంటి అతనికి ఇలాంటి పేరు పెట్టారు ఏంటి మీరు ముస్లీమా అని అడిగారు సార్.
లేదు సార్ మేము ముస్లింలను కాదు మేము హిందువులమే కానీ మా అమ్మ వాళ్ళు పిల్లలు పుట్టి చనిపోతుంటే నాకు ఈ పేరు పెట్టారు అందువల్లే నేను బ్రతికాను అని వాళ్ళ నమ్మకం అంటూ తన గురించి మొత్తం చెప్పాడు.
ఆ తర్వాత అమ్మాయిల పేర్లు కూడా అడిగాడు మేమంతా మా పేర్లు, మేము ఎక్కడ నుంచి వచ్చేది సార్ కి చెప్పి కూర్చున్నాం. పరిచయ కార్యక్రమాలు అయిపోయాయి మీరు వెళ్లిపోండి అని చెప్పేశారు.
ఈరోజు క్లాస్ ఏమి తీసుకోను ఇంకా వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఈ మంత్ ఎండింగ్ వరకు చూసి నెక్స్ట్ మంత్ మీకు క్లాసులు మొదలు పెడతాను. కానీ మీరు రోజు వచ్చి వెళుతూ ఉండాలి.
ఎందుకంటే ఇప్పటి నుంచి అటెండెన్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది అంటూ ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారు. దాంతో మేమందరం సరే అన్నాం ఇక మర్నాడు చదువుకు కావలసిన పుస్తకాలన్నీ కొనుక్కొని రోజూ కాలేజీకి వెళ్లి రావడం మొదలు పెట్టాను.
కొన్ని రోజుల తర్వాత భాస్కర్ సార్ చెప్పినట్లుగానే మాలో బిడియం, భయం పోయింది ఫ్రీగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడే జహంగీర్ అనే అబ్బాయికి మేము ఒక కొత్త పేరు అనేది పెట్టాలి అనుకున్నాం.
అప్పుడు నేను అందరికీ నచ్చేలా అతని పేరు అభిలాష్ అయితే చాలా బాగుంటుంది అని అన్నాను. ఆ పేరు జహంగీర్ కి అదే అభిలాష్ కి చాలా నచ్చింది.
దాంతో నువ్వు నిజంగా నాకు చాలా మంచి పేరు పెట్టావు నీకు చాలా థ్యాంక్స్ అందరూ అలాగే పిలవండి అని అన్నాడు. ఇక మేమందరం అప్పటి నుంచి అతని కాకుండా అభిలాష అని పిలిచేవాళ్ళం.
అన్ని కాలేజీలలో కాకుండా మా కాలేజీలో అమ్మాయిలు, అబ్బాయిలు స్నేహంగా మెలిగే వారు ఒకరినొకరు అడిగి తెలుసుకునేవారు.
ఒకరోజు రాకపోయినా మిగిలినవారు వారికి సహాయం చేస్తూ ఉండే వారు అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.
మా చదువులు అయిపోయాయి సెంటర్ మాత్రం వేరే ఊర్లో పడటంతో అక్కడ పరీక్షలు రాశాం. మా పేర్లు క్యాపిటల్ లెటర్స్ ప్రకారంగా వేర్వేరు గదుల్లో పడిన అందరం ఒకే బస్సులో వెళ్ళేవాళ్ళం ఒకే బస్సులో తిరిగి వచ్చేవాళ్ళం పరీక్ష ఎలా రాశావు అనే డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం.
పరీక్షల తర్వాత విడిపోవాలి అనే ఒక దిగులు కూడా మమ్మల్ని ఆవరించింది. ఇక చివరి పరీక్ష రోజు అందరం వాళ్ల వాళ్ల ఫోన్ నెంబర్స్ తీసుకున్నాం.
అప్పటికి ఫోన్లు లేవు కాబట్టి పక్కవారితో లేకపోతే ల్యాండ్లైన్ ఫోన్లు తీసుకున్నాం. నా దగ్గర ఫోన్ నెంబర్ లేదు. కాబట్టి నేను ఏమి ఇవ్వలేదు.
అభిలాష్ దగ్గర కూడా ఫోన్ లేదు మరి ఇలా కలవడం ఎప్పుడైనా గుర్తుకు వస్తే ఎలా మాట్లాడాలి అని అనుకున్నాం అందువల్ల అడ్రసు ఇచ్చిపుచ్చుకున్మ్నా
ఆ తర్వాత అందరం ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయాం అనేకంటే విడిపోయాం అని చెప్పవచ్చు.
ఆ తర్వాత నాకు ఎప్పుడూ జహంగీర్ అదే అభిలాష్ ఉత్తరాలు రాయలేదు నేను కూడా రాయలేదు నా జీవితపు హడావిడిలో మర్చిపోయాను.
కానీ ఇప్పటికైనా అభిలాష్ నాకు కనిపిస్తాడని నేను అనుకుంటున్నాను అదే నా అభిలాష కూడా నా ఈ రచన చదివిన జహంగీర్ అలియాస్ అభిలాష్ ఎక్కడ ఉన్నా స్పందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
– అర్చన