అబ్బాయిల జీవితం
పితృస్వామ్య వ్యవస్థ ద్వారా మగవాళ్ళు ఆడవాళ్ళని అనాది కాలం నుండి అన్ని విధాలా అధఃపాతాలానికి అణగద్రొక్కుతూనే ఉన్నారు ఈరోజుకి కూడా. చదువు ప్రసాదించిన తెగువతో ప్రపంచాన్ని అర్థంచేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు మహిళామణులు.
ఇది ఇలా సాగుతున్న తరుణంలో కొంతమంది స్త్రీలు స్త్రీ వాదాన్ని తమ స్వంత ప్రయోజనాల కోసం చెడు మార్గంలో ఉపయోగించుకుని ఆడజాతి అభివృద్ధికి అహర్నిశలూ కృషి చేస్తున్న ఎందరో మహనీయుల పోరాటాలకు అర్థం లేకుండా చేస్తున్నారు. మరి ఇది మగవారి దురదృష్టమో లేక ఆడజాతికి పితృస్వామ్య వ్యవస్థ ద్వారా వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన ప్రతిఫలమో తెలీదు కానీ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల చేతిలో మోసపోతూ ఉండడం మాత్రం బాధాకరం.
పూర్వపు రోజుల్లో ఎత్తిన తల దించకుండా, అమ్మ, నాన్న మాట జవదాటకుండా పెంపకాలు ఉండేవి. నిజానికి లోకం తెలీకుండా సమాజమనే భయం చూపించి పెంచేవారు. టెక్నాలజీ వృద్ధికి నోచుకోకపోవడం ఒక కారణం. ఇప్పుడు లోకం మారింది. టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచమే మనిషి అరచేతిలోకి వచ్చి వాలింది. అలాగే ప్రేమ, పెళ్ళి, కుటుంబ వ్యవస్థ వగైరా వాటిల్లో మార్పు సంభవించింది.
ఈరోజుల్లో కొందరి యువతి, యువకులకు ప్రేమ అంటే కేవలం వారి అవసరాలు తీర్చుకునే ఒక సాధనం. నిజాయితీగా ప్రేమించే అబ్బాయిలను వల విసిరి పట్టుకోవడమే ఒక కళ. అబ్బాయిలకు ప్రేమ ఎర వేసి, అవసరాలు తీర్చుకుని, వాళ్ళ మనోభావాలతో ఆడుకుని మోసం చేసి వదిలేయడం సర్వ సాధారణం అయిపోయింది.
పాపం నిండా ప్రేమలో మునిగి గుడ్డిగా ఇలాంటి అమ్మాయిలని నమ్మి మోసపోయి వాళ్ళని మర్చిపోలేక, మోసాన్ని తట్టుకోలేక, ప్రేమని చంపుకోలేక నరకం అనుభవిస్తున్న అబ్బాయిల పరిస్థితి వర్ణనాతీతం. సహజంగా బాధ వచ్చినప్పుడు ఏడుపు ద్వారా ఉపశమనం కలుగుతుంది కానీ సమాజంలో పాతుకుపోయిన నియమం ఏంటంటే మగవాళ్ళు ఏడవకూడదు కేవలం ఆడవారికే ఆ హక్కు ఉంది. ఏడుపు బలహీనతకి చిహ్నం అని చెప్పి పితృస్వామిక వ్యవస్థ ఏడవటం అనే విషయంలో అబ్బాయిలకి చాలానే అన్యాయం చేసిందనే చెప్పాలి.
మోసం చేసి వదిలేసిన వాళ్ళు ఎప్పటిలాగే ఉంటారు. వాళ్ళ జీవితం కొంచెం కూడా ప్రభావితం కాదు. కానీ ప్రాణంగా ప్రేమించి, అమ్మాయిలకి నచ్చినట్టు వాళ్ళని మార్చుకొని, అమ్మలా చూసుకోవాలి, తనొక చంటి పిల్లాడు అయిపోయి స్వచ్ఛమైన ప్రేమ పొందాలి అని జీవితం మొత్తాన్ని ఊహించుకుని, వాళ్ళ అలవాట్లలను, ఆత్మీయులను దూరం చేసుకుని అనాధగా మిగిలిపోయి వేదనతో జీవితాన్ని వెళ్ళబుచ్చే అబ్బాయిల కష్టం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
ఇలా మోసపోయిన వారు మానసికంగా శక్తివంతులయితే కొన్నాళ్ళకి కుదుట పడతారు. సున్నిత మనస్కులు అయితే బాధని అనుభవించలేక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అదృష్టవశాత్తూ మోసపోయిన అబ్బాయిల జీవితంలో వాళ్ళని అర్థంచేసుకుని ఓదార్చే వ్యక్తులు అనగా స్నేహితులు గానీ, కుటుంబ సభ్యులు గానీ, భాగస్వాములు గానీ ఉంటే కాస్త తొందరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి అనడం అతిశయోక్తి కాదు.
ఈ కర్కశ ప్రపంచంలో నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ప్రేమించడం కూడా సమస్యలను తీసుకొస్తుంది. ప్రేమ జీవించడానికి అవసరమే కానీ ప్రేమే జీవితం కాదు. ఎవరి నుండో ప్రేమ పొందాలని ఆశించి భాద పడడం వ్యర్థం. ఎల్లప్పుడూ మన పైన మనం ప్రేమ పెంపొందించుకుని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం ఉత్తమం. అప్పుడు ఎవరు మనల్ని ప్రేమించకపోయినా అంతగా ప్రభావితం అవ్వకుండా జీవితాన్నీ సంతోషంగా, సమర్థవంతంగా నిర్మించుకుని ఉన్నత శిఖరాలను చేరుకోగలం అనే విషయాన్ని నేటి తరం యువత గ్రహించాలి.
– రమ్య పాలెపు