ఆత్మీయ కలయిక
పాతికేళ్ల క్రితం విడిపోయిన వారందరూ ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కుని అందర్నీ ఒక చోట చేర్చి, ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి, బాల్యపు గురుతులను జ్ఞాపకం చేసుకోవడానికి జరిగే ఆత్మీయ కలయిక.
ఇది పాఠశాల, కళాశాల, లేదా ఆఫీసులో కూడా జరగవచ్చు. కానీ పాఠశాలలో జరిగే కలయిక ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పుట్టిన ఊరును చూడొచ్చు, ఆడుకున్న ఆటలు గుర్తు చేసుకోవచ్చు, (మర్చిపోతే కదా) పాత తాత అవ్వలను మాట్లాడించవచ్చు. మనం చిన్నగా ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు మన వయసులో ఉండగా చూడడం చూడొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు విజ్ఞానం అందించిన గురువులను చూడొచ్చు, వారితో అప్పుడు తిన్న దెబ్బలని వారు మన భుజం తడుముతూ ఉంటే అప్పుడు కొట్టిన వారెనా అని ఆశ్చర్య పోవచ్చు.
అప్పటి వరకు జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, దిగజారుతూ, ఎత్తు పల్లాలు చూస్తున్న మనల్ని వారి మాటలతో ప్రభావితం చేయవచ్చు. వారు కూడా ఎన్నో అనుభవించే వచ్చారు కాబట్టి ప్రతి విషయం వినాలి అని ఇప్పుడు అనిపిస్తుంది. చిన్నప్పుడు అబ్బా ఈ సార్ బుర్ర తింటాడురా అని అనుకున్న మనమే ఇప్పుడు వారు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా వింటూ గుర్తు పెట్టుకుంటాం.
మనం కూర్చున్న బెంచిలను తడుముతూ అప్పుడు సన్నని బ్లేడ్ తో చెక్కిన మన పేరును అపురూపంగా చూసుకుంటాం. ఊహ తెలియని వయసులో ఇష్టపడిన అమ్మయో, అబ్బాయో వారి పిల్లల గురించో లేదా వారిని తీసుకుని వస్తె అపురూపంగా, ఆనందంగా చూస్తూ ఉండిపోతాం. ఆ వయసులో వచ్చిన ఆలోచన తల్చుకుంటూ మనలో మనమే నవ్వుకుంటాం.
అప్పుడెప్పుడో ఆటల్లో గోళీలు దోoగిలించిన అబ్బాయితో గొడవపడి, మాట్లాడడం మానేసిన మనం ఇప్పుడు అతను కనిపించగానే అన్ని మర్చిపోయి ఆలింగనం చేసుకుంటాం. గడిచిన కాలం తిరిగి రాదని అనుభవంతో తెలుసుకున్న పాఠలను అందరితో పంచుకుంటూ, జీవితంలో అంతవరకు జరిగిన సంఘటనలు చెప్పుకుంటాం. కుల, మత బేధాలు లేకుండా ఎలా కలిసి చదువుకున్నామో, ఇప్పుడు అలాగే సహపంక్తి భోజనాలు చేస్తాం. అవయ్యాక అప్పటి ఆటలను తల్చుకుంటూ మళ్లీ వాటిని ఆడుకుంటాం.
ఆటల్లో పడి కాలం కరిగిపోతుంది. తిరిగి వెళ్లాల్సిన సమయం, ఎదురుచూస్తున్న బాధ్యతలు గుర్తుకు వచ్చి, కళ్ళలో కన్నీరు నిండుతుంది. మళ్లీ ఎప్పుడంటే ఏమో చెప్పలేము అంటూ బరువైన గుండెలతో వెనక్కి మరలిపోతాము.
కాలం, బాల్యం, యవ్వనం తిరిగి రావని, పాఠశాల అంటే కేవలం చదువోక్కటే నేర్పేది కాదని, జీవిత అనుభవాలను ఎదుర్కొనే శక్తి ఇవ్వగల ఒక మహత్తర అవకాశం అని తెలుసుకుంటూ అందమైన జ్ఞాపకాలను మదిలో నింపుకుంటూ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి ఇక్కడి నుండే ధైర్యం తెచ్చుకుని ఆత్మీయ కలయిక అంటే కేవలం కలుసుకోవడం కాదు. ఎవరెన్ని జీవిత పాఠాలు నేర్చుకున్నారు అని తెలిపేందుకే అని తెలుసుకుంటూ, తిరిగి కలుద్దాం అంటూ వీడ్కోలు పలుకుతాం..
– భవ్య చారు