ఆత్మచిత్రం – డా.కేదారనాధ్ సింగ్ కవితలు
ఒక కవి ఆత్మను పట్టుకోవాలంటే అతని అక్షరాలే కాదు, అతని తిరుగాడిన నేల పరిమళం, నడయాడిన మనుషుల వాసన కూడా ముఖ్యం. అప్పుడు కానీ ఆ కవి అవగతం కాడు. సరిగ్గా కిల్లాడ సత్యనారాయణ గారు ఆ పనిచేశారు. సుప్రసిద్థ హిందీ కవి, జ్ఞానపీఠాన్నందుకున్న డా.కేదారనాథ్ సింగ్ కవిత్వం ఆయన్ని కుదురుగా కూచోనివలేదు.
ఉత్తరప్రదేశ్ లోని వారి స్వగ్రామం చకియా దర్శించేలా చేసింది. ఆయన పేరు చెబితే చాలు ఆ గ్రామ పులకించిపోవటం చూశారు. అలా కేదారనాథ్ సింగ్ సాహిత్యం మొత్తాన్ని ఆవాహన చేసుకున్నారు.. కేదారనాథ్ కవిత్వంలోని మనుషులను, మూగజీవాలను గుర్తుపట్టారు.ఆయనకు భోజ్ పురి భాషంటే ప్రాణమని గుర్తించారు.
హిందీ నా దేశం
భోజ్ పురి నా ఇల్లు
ఇంటినుండి బయటకి వస్తే
దేశంలోకి వెళ్లి పోతాను
“మాతృభాష” కవితలో ఆయన పంక్తులు గుర్తు చేస్తారు.
కేదారనాథ్ సింగ్ కవిత్వం లోంచి వంద రసగుళికలను ఎంచి తెలుగు పాఠకలోకానికి అందించారు కిల్లాడ సత్యనారాయణ. కేదారనాథ్ సింగ్ కవిత్వం లోని సహజత్వం, సరళత్వం, వ్యక్తిత్వంలోని నిరాడంబరతను వ్యక్తపరిచే కవితలను మనకందించారు. ఆయన కవిత్వమంటే అతి సాధారణమైన వస్తువుల ఆత్మను, ప్రదేశాల యొక్క కంటికి కనిపించని పొడవు, వెడల్పు, ఎత్తులను, జీవులన్నింటిలోను వెలిగే సహజాత సౌందర్యాన్ని దర్శించడమేనంటారు.
అనువాదమంటే అక్షరాల కూర్పే కాదు. కవి హృదయంలో చొరబడి ఆ వెలుగును పిడికిట పట్టి పాఠకులకు అందించటం. ఆ ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు. కేదారనాథ్ సింగ్ ఆత్మచిత్రాన్ని మన హృదయాలపై ఆవిష్కరిస్తారు. మూల కవి వ్యక్తిత్వం, జీవితాలను అధ్యయనం చేయటం ద్వారా ఆ కవి దృక్పథం అవగతం చేసుకోవచ్చని అనువాదకులు కిల్లాడ సత్యనారాయణ నిరూపిస్తారు.అందుకు తలమానికంగా హృదయ సబంధితమైన వారి సరళ అనువాదం మనచేతికందింది
వివరాలు
వెల 150రు.
పేజీలు 170
రమా ప్రచురణలు
ప్రతులకు 8333987838 నంబర్ సంప్రదించవచ్చు
– సి యస్ రాంబాబు