ఆత్మ పరిశీలన

ఆత్మ పరిశీలన

సీత గారు ఎదో ఆలోచిస్తున్నారు. మిశ్రమ భావాలు ఆవిడ మొహం లో ప్రస్ఫూటం గా కనిపిస్తున్నాయి. ఉదయాన్నే 4 గంటలకి లేచేసి కూర్చుంది. ‘అవుతుంది’ అనుకున్నప్పుడు ఆవిడ కళ్ళు వికసిస్తున్నాయి. ‘కాదేమో’ అనిపించినప్పుడు కనుబొమ్మలు చిట్లించుకుంటున్నాయి. ఇలా, సంతోషం, అసంతృప్తి రెండు ఆవిడ మోహంలో నటించేస్తున్నాయి.

ఇంతలో అంతపొద్దున్నే ఏంటో హడావుడి పక్కింటి రాధ గారు తలుపులు తోసుకుని మరీ లోనికి దూసుకుని వచ్చేసింది. సీత మొహంలో మిశ్రమ కళ చూసి, రాధ గారు ఇట్టే పసిగట్టింది. ఎలా ఐనా సీత గారిని ఒకే వైపు ఆలోచింపజేయాలి అని ఆ క్షణం లో కంకణం కట్టేసుకుంది. అలా చేయాలి అంటే ఆమె దేనికి బాధ పడుతోందో దాన్ని ఆమె మనస్సు లోంచి తొలగించాలి.

సీతా, ఏంటి… అలా కూర్చున్నావు? పో, వెళ్లి లోపలనుంచి కూరలు తీసుకు రా! తరుగుతూ మాట్లాడుకుందాం! కాఫీ గట్రా తాగావా? వుండు కలుపుకొని వొస్తా. 

సీత మౌనంగా ఉండి పోయింది.

రాధ కాఫీ కలిపి కూరలబుట్ట కూడా తెచ్చింది. ఆమె ఉద్దేశ్యం తీరుబడిగా మాట్లాడుకోవచ్చు అని.

అదే మౌనం సీతలో.

ఏయ్, సీతా……! సారీ అమ్మా. నేను రెండు రోజుల క్రితం నిన్ను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు. నాకు నోటి దుల ఎక్కువ. అందరికి నాతో ఇదే సమస్య.

సీత లో అదే నిశ్చలత.

రాధ ఒక చీపిరి తీసుకొని మూడు గదులు ఊడ్చేసింది. ” అవును, అన్నయ్య గారు ఊరు వెళ్లినట్టు వున్నారు. ఆయన వెళ్లిన పని అయిందా? బుజ్జి గాడి ఫీజు 50,000/- కట్టాలి అని ఎవరితోనో చెప్పుతుంటే విన్నాను. డబ్బు సర్దుబాటు అయిందా? సీత……. నిన్నే!

సీతది అదే మౌనం.

చీర కొంగులో ముడేసుకొచ్చిన నోట్ల కట్టల్ని తీసి రాధ టేబుల్ పైన పెట్టింది. ఇగో, మీ బాబు కాలేజ్ కి కట్టాల్సిన డబ్బు. అన్నయ్య గారు రాంగానే కట్టేయమను. ఇవి మీరు నాకు మళ్ళీ ఇవ్వాల్సిన పని లేదు. వడ్డీ ల పై వడ్డీ లు గుంజి కూడబెట్టిన ముదనష్టపు సొమ్ము. నేను ఇప్పుడైనా మారాలి.

సీతలో అవే మిశ్రమ భావాలు. ఇంతలో ఎవరో తలుపు కొట్టారు. “ఎవరూ……. “, అంటూ వెళ్లి తలుపు తీసింది, సీత.

వొచ్చింది పని అమ్మాయి. వొస్తూనే ఆయాస పడుతూ ఇలా చెప్పింది, ” అమ్మా, పక్కింటి రాధ గారు నిన్న రాత్రి 12 గంటలకి గుండె పోటుతో చనిపోయారు. ఈ విషయం ఇంకా ఎవరికీ తెలియదు. వాళ్ళ ఆయన కూడా ఊర్లో లేడుట. వాళ్ళ పెద్ద అబ్బాయి ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడుట. హాస్పిటల్ వారు ఇంకా శవాన్ని ఇవ్వలేదుట. “

ఇదండీ, సంగతి. రాధ గారు బ్రతకి వున్నన్ని రోజులూ చేసుకోలేని పరిశీలన ఇప్పుడు చేసుకున్నారు. ఈ ఆత్మ పరిశీలన ముందే ఉంటే బావుండేది.

– వాసు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *