ఆమె
సమస్త మానవ రూపానికి జీవం
పోయగల శక్తి సామర్థ్యాలు
కలిగినది ఆమె
ఆమె సగభాగం కాదు అంతను ఆమెనే
ఆమె శరీరం నుండి
వేరు చేయబడ్డ పిండానివి నీవు
అతడు ఒక అతడే కానీ
ఆమె ఒక మానవ కుటుంబం
కోటానుకోట్ల మనిషి శరీరాల్లో
ప్రవహిస్తుంది ఆమె రక్తమే
విత్తనమై మొలకెత్తె మొక్కలకు
నేలే ఆధారమైతే
ఆమె గర్భంలో పెరుగుతున్న
కణానికి అన్ని అందిస్తూ ఆయుష్షు
పోస్తూ ఆధారం అవుతుంది
ఆమె అతడి పుట్టుకలో ఒక
అద్భుతాన్ని సృష్టిస్తుంది
ఆమె నవ మాసాలు మోసి
జీవితాన్ని ఇస్తుంది
ఆమె రక్తాన్ని పాలుగా మార్చి
అతడి ఆకలి దప్పికలు తీరుస్తుంది
ఆమె ఈ ప్రపంచానికి అతడిని
పరిచయం చేస్తూ నిండు నూరేళ్ల
ఆయుష్షును పోస్తుంది
ఆమె అతడి బాల్యంలో తల్లిగాను
అతడి యవ్వనంలో భార్య గాను
అతడి వృద్ధాప్యంలో సేవకురాలిగాను
ఆమె జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగిస్తూ
అతడి జీవితంలో వెలుగులు నింపుతుంది
అయినా………
ఆమె అంటే అతడికి చిన్న చూపూ చులకనే
ఆమె అని తెలిస్తే చాలు
కడుపులో పెరుగుతున్న
పిండాన్ని సైతం చంపేంత కసిని
పెంచుకుంటున్నాడు అతడు
ఆమెను చూస్తే చాలు కామంతో
కాటేసి పిశాచిగా మారుతున్నాడు
అతడు
ఆమె నిరాకరిస్తే చాలు
మృగంలా మారి
ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ
అత్యాచారాలు చేస్తూ హత్యలు
చేస్తున్నాడు అతడు
ఆమె చేత సృష్టించబడ్డ అతగాడు
సమస్త మానవ భూ ప్రపంచంలో
అతడు ఆమెకు రుణపడి ఉన్నాడు.
– బొమ్మెన రాజ్ కుమార్