ఆకలని కేకేస్తే
ఆకలని కేకేస్తే అమ్మ అనినే అరుస్తే
ఆ అరుపులో నా ఆకలి ఆర్తనాదం
శివయ్య ఢమరుకంలా తాండవిస్తే
ప్రతి ధ్వనిస్తే ప్రజ్వలిస్తే బోరున విలపిస్తే
అమ్మ అమ్మా అంటూ శోక సంద్రంలో మునిగితే
రామయ్య విరిచిన శివధనుస్సులా
భారతంలో కర్ణుడు రథచక్రంలా
నొప్పిగా డొక్కలు వంగి ఎండి విరిగి
కూలి కుమిలి ఏడుస్తుంటే…?
కిర్రు కర్రు మంటూ సర సర
విలవిలలాడుతుంటే పరిగెడుతుంటే
ఆకలి పరుగులు తీస్తుంటే..?
సద్ది మెతుకుల బిక్షాటన శకుని సేకరణల
ఒక బిడ్డ కడుపు నింపడానికై తీర్చిదిద్దడానికి ఎదగడానికి ఓ తల్లి ఆరాట ప్రయత్నం వీధికేక్కితే….?
ఓ అపరాత్రి పరిమళించిన
ఆ యవ్వన అనాధ తల్లి
ఆకలి స్వరగానం ఆలాపన చేస్తూ..
బ్రతుకు పోరుకై బజార్ కెళ్తే
చేరదీశారు చెరిపివేసారు
కొన్ని వేల మంది కౌరవులకు
వెల కట్టించి వేశ్యగా దాసిగా
అవసరాలు తీర్చే అంగడి వస్తువుగా
మార్చేశారు….?
మరి ఏ రాత్రి పుట్టకో నాది
ఏ కౌరవ పుత్రికనో నేను
ఏ వెల మాయ జూదానికి కడుపున
పడ్డానో నేను.. నా తల్లి నన్ను
ఎందుకు నవమాసాలు మోసిందో
ఈ ఆకలి గానం పాడేలా పాడించేలా పాడుకొనేలా ఎందుకు చేసిందో ఏమో..!
మళ్లీ నా కడుపు నింపడానికై
వీధికెక్కింది బిక్షాటనకై అనుకుంటే
ఆ పాడుబడ్డ యవ్వనం నా తల్లి లో
ఒక స్త్రీని చూడటం లేదే
భిక్షాటన చేసే బిక్షగత్తిగా చూడడం లేదే
కూలి పని చేద్దాం అంటే పక్కకే పిలుస్తున్నారే
విషం చిమ్మే పురుష సర్పాల కాటుకు
గావు కేక పెడుతూ చితికి తల్లడిల్లిపోతుందే
ఏ ధ్రుతరాష్ట్ర కౌగిలింతలో బందీ అవుతుందో
ఇక నా తల్లి ఏ పీడరాత్రిలో కలిసిపోతుందో…?
కాలానికి ఇది న్యాయమా..?
మమ్మల్ని ఇంతగా శిక్షించడం ఔదార్యమా
ఇది మా ఆకలి కేకల ఆర్థగానమా
కాలిన కడుపుల మంటలు ఆరేదెన్నడో
ఆర్పేదేపుడో…. ఆకలి తిరేదెన్నడో
అప్పటి దాక ఆకలి కోసం వీధికేక్కడం
విధి వంచనలో పడకేక్కడం ఇక అలవాటే
ఇది నా తల్లి పొరపాటే ఈ బిడ్డ గ్రహపాటే..!!
– సైదాచారి మండోజు