ఆచారాల కట్టుబాట్లను దాటమనే అంటే సుందరానికి
కొన్ని సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాయి. కొన్ని సినిమాలకు కాంబినేషన్లు సెట్ అవుతాయి. నవ్వులు పంచటం ఖాయమని భరోసా ఇచ్చిన సినిమాల్లో చాలావరకు మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేసిన సినిమా అంటే సుందరానికి.
రెండు మతాల పిల్లలు ప్రేమలో పడినప్పుడు, ఆ ప్రేమని పెద్దలు అంగీకరించరని తెలిసినప్పుడు అబద్దాల పునాదిపై తమ ప్రేమను గెలిపించాలనుకుని, అందుకు ఆడిన డ్రామాలు ఎటువంటి పరిస్థితుల్లోకి ఆ జంటను నెట్టాయన్న కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ అంటే సుందరానికి.
అటు బ్రాహ్మణ కులాన్ని కించపరచకూడదు, ఇటు క్రిస్టియన్ కమ్యూనిటీని హర్ట్ చేయకూడదు. దర్శకుడికి ఇది కత్తిమీదసాము లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే కాంప్లెక్స్ గానే ఉంటుంది రైటింగ్. మధ్య మధ్యలో మీదో గంట సమయం కావాలంటాడు హీరో తన బాస్ ని.
అలా మనతో తన కథను కష్టాలను చెప్పుకుంటుంటాడు. ఫస్టాఫ్ కథేమీ సాగదు కానీ, కేరక్టర్లను ఎస్టాబ్లిష్ చేయటంతో సరిపుచ్చుతాడు దర్శకుడు.. కేరక్టర్లలో కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. సుందరం తండ్రి, తల్లి, బామ్మ కానీ, హీరోయిన్ తల్లి, తండ్రి, అక్క, తండ్రి స్నేహితుడు కొడుకు జోసెఫ్ కానీ, సుందరం బాస్ హర్షవర్ధన్ కానీ..
ఇలా కేరక్టర్లను రాసుకునేటప్పుడు వాటి ఐడెంటిటీని రంగు, రుచి, వాసనలను మరచిపోలేదు దర్శకుడు వివేక్ ఆత్రేయ. దానివలన లాగ్, డ్రాగ్ అనిపించలేదు మూవీలో.
కాస్త తరచి చూస్తే సమాజంలోని మతాలు, మనుషుల మధ్య సృష్టించిన అంతరాలను subtle గా చూపుతాడు.కొడుక్కు ఎదురయ్యే గండాలను, హోమాలు, పూజలతో కట్టడి చేద్దామని సుందరం తండ్రి శాస్త్రి భావిస్తే, హీరోయిన్ తండ్రి కూతురు కున్న ఐడెంటిటీ క్రైసిస్ ని తొలగించటానికి ఫొటోగ్రాఫర్ గా తీర్చిదిద్దుతాడు.
అంత ప్రోగ్రెసివ్ తండ్రి ఇతర మతస్తుల ప్రసాదం తినడానికి ఇష్టపడడు. దానికో బ్యాక్ స్టోరీ చెబుతాడనుకోండి దర్శకుడు. అన్యమతస్తుల ప్రవచనాలు వినాలంటే మొహం చిట్లిస్తుంది హీరో కుటుంబం. ఇలాంటి చేదునిజాలు ధైర్యంగా రాసుకున్నాడు దర్శకుడు.
మొదటినుండి తథాస్తు దేవతలు అసుర సంధ్య వేళ ఏదనుకుంటే అది నిజం చేస్తాయన్న భ్రమలోకి మనల్ని దర్శకుడు విజయవంతంగా లాక్కెళతాడు. సుందరం పాత్రది అశ్వినీ నక్షత్రం కావటంతో తథాస్తు దేవతల ప్రభావం మరీ ఎక్కువని మనల్ని నమ్మిస్తాడు.
ప్రేమకోసం అబద్దాలు ఆడితే అవి కొంపలు ముంచొచ్చు జాగ్రత్త అంటూనే, కులమతాలకతీతంగా ఆపదలో కలిసే మనుషులు, పరిస్థితులు చక్కబడగానే మళ్లీ తమ ‘ఎగో ‘లతో ‘ఎగొనీ’ సృష్టించటమే విషాదమని హీరో తల్లి పాత్రతో చెప్పిస్తాడు..
మతాలకన్నా మానవత్వం గొప్పదని అందరూ చెప్పే మాటే అయినా అది మనలో రిజిస్టర్ చేస్తాడు దర్శకుడు. అది అతడి గొప్పదనం ఇలాంటి కథకు ఫ్లాష్ బాక్ తప్పదు. ఆ ఫ్లాష్ బాక్ కొంచెం డోసెక్కువే అనిపిస్తుంది కొన్నిసార్లు.
సముద్రం దాటితే (అంటే అమెరికా వెళ్ళటం) ప్రాయశ్చిత్తం చేయాలనటం మరీ అతిగా అనిపిస్తుంది. బారిష్టర్ పార్వతీశం స్ఫూర్తి అంటాడు దర్శకుడు. హర్షవర్ధన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ఫీలింగ్స్ చెప్పిస్తున్నాడా దర్శకుడు అన్నట్టుగా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. అలా హర్షవర్ధన్ మనలను మెప్పిస్తాడు కూడా.
ఇక హీరోయిన్ నజ్రియా, తల్లి పాత్ర పోషించిన నదియా, తండ్రి పాత్ర పోషించిన తమిళ్ నటుడు అజగం పెరుమాళ్ళు, అక్క నిక్కీ తంబోలీ అందరూ మరియు నటనలో మళయాళీ క్రిష్టియన్ ఫామిలీ ఫీల్ ఇస్తారు.
వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం బావుంది పాటల కన్నా.. ఫొటోగ్రఫీ బాగా కుదిరింది. ఎడిటింగ్ ఇంకొంచం క్రిస్ప్ గా ఉండాల్సింది. ఫైట్స్ లేకపోవటం ప్రాణానికి హాయిగా ఉంది.
ఒక్కమాటలో చెప్పాలంటే తెలిసిన కథను మల్టీ లేయర్డ్ మూవీగా తీర్చిదిద్దిన దర్శకుడు వివేక్ ఆత్రేయతో పాటు నటులు నాని, నరేష్, రోహిణి, నజ్రియా అందరూ అభినందనీయులే!
– సి. యస్. రాంబాబు