నిజాన్ని దాయవలసిన సందర్భాలు
మహాత్మాగాంధీజీ సత్యం, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సమయంలో పాల్గొని మన దేశానికి
స్వాతంత్ర్యం సిద్ధించేటట్లు చేసారు. మనకు జాతిపితగా నిలిచారు. నిజానికంత శక్తి ఉంది. పురాణ కాలంలో కూడా రాజా హరిశ్చంద్రుడు సత్యం కోసం తన రాజ్యాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసి సత్య హరిశ్చంద్రుడు అని అచంద్రతారార్కం ఉండేలా కీర్తిని సంపాదించాడు.
అది చాలా గొప్ప విషయమే. అయితే కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పినా మనకు పాపం అంటదని శాస్త్రం చెబుతోంది. వారిజాక్షులందు వైవాహికములందు, ప్రాణ విత్త మాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంక వచ్చు నఘము వొంద దధిప అని పోతన తన భాగవత గ్రంధలో వ్రాసారు.
ఆడవారిని కాపాడే విషయంలో కానీ ప్రాణానికి, ధనానికి,గౌరవానికి భంగం కలిగేటప్పుడు కానీ గోవులను, విప్రులను కాపాడేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు. దానివల్ల ఏ పాపం రాదు అని శుకృడు ఆ బలిచక్రవర్తితో అన్నట్లు పోతనగారు వ్రాసారు. ఆ విధంగా సందర్భాన్ని బట్టి సత్యాన్ని దాయవచ్చు అనేది శాస్త్ర ప్రమాణంగా నిలిచింది.
– వెంకట భానుప్రసాద్ చలసాని