పాలబువ్వ అందించాలి
“చంద్రయాన్ సక్సస్ మనదేశానికి గర్వకారణం” అన్నాడు మనవడు తన తాతతో. “నిజమే మనవడా, ఇది చాలా గొప్ప విషయం. మనమందరం గర్వించదగ్గ విషయం. ఈ ప్రయోగానికి చాలా ఖర్చు అయి ఉంటుంది కదా” అన్నాడు తాత తన మనవడితో.
“అవును తాతా, కొన్ని వందల కోట్లు ఖర్చు అయ్యింది. మొత్తానికి మన దేశం చంద్రుని పైకి తన కృత్రిమ ఉపగ్రహం పంపించగలిగింది. ఈ విజయం వైజ్ఞానిక రంగ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినది. భవిష్యత్తులో మన దేశం మానవులను కూడా చంద్రగ్రహంపైకి పంపగలదు” అన్నాడు మనవడు తాతతో.
“నిజమే మనవడా,చాలా మంచి విషయాలు చెప్పావు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మన దేశానికి మంచి రోజులు వచ్చాయి కానీ ఎంత మంది తల్లులు తమ పిల్లలకు చంద్రుడుని చూపించి పాల బువ్వ పెట్టగలుగుతున్నారు. పేదరికం మన దేశాన్ని పట్టి పీడిస్తోంది.
పిల్లలందరికీ పాల బువ్వ అందే రోజు ఎప్పుడు వస్తుంది. ప్రభుత్వం ఈ విషయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఏ రోజైతే అందరు తల్లులు తమ పిల్లలకు చంద్రుణ్ణి చూపించి పాలబువ్వ పెట్టగలరో. ఆ రోజే కదరా మనకు నిజమైన విజయం” అన్నాడు తాత తన మనవడితో. “నిజమే తాతా,ఆ రోజు త్వరలో వస్తుంది అని ఆశిద్దాం”అన్నాడు మనవడు తాతతో “తధాస్తు” అన్నాడు ఆశాశం నుంచి వారి మాటలు విన్న చంద్రుడు.
– వెంకట భానుప్రసాద్ చలసాని