మధుర జ్ఞాపకాలు
అలనాటి మధుర జ్ఞాపకాలను తలుచుకున్న కొద్దీ ఆనందంగా ఉంటుంది. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడ అంతా చాలా విచిత్రంగా అనిపించేది. ఒకవైపు సంపదకు ప్రతిరూపంగా ఉన్న ఆకాశ హర్మాలు వాటి పక్కనే పేదరికానికి నిలువుటద్దం అనిపించే బస్తీలు కనపడేవి. నగర రోడ్లపై రయ్-రయ్ మని వేళ్ళే కార్లు వాటి పక్కనే సామాన్యులు తిరిగే బస్సులు, సైకిళ్ళు కనపడేవి. ఏమిటీ వైవిధ్యం అని అనిపించినా తర్వాత అసలు విషయం అర్థం అయ్యింది.
ధనవంతులకే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. మిగతా వారంతా ఆ డబ్బులు సంపాదించే పనిలో పోటీ పడుతూ ఉన్నారని. నాకు తెలియకుండానే నేను కూడా అదే పోటీలో పాల్గొంటున్నానని తర్వాత అర్ధమైంది. డబుల్ డెకర్ బస్సుపై ప్రయాణం నాకు చాలా అద్భుతంగా అనిపించింది.
రోడ్లకు ఇరువైపులా పెద్ద చెట్లు వాహనదారులకు విశ్రాంతిని ఇచ్చేవి. రోడ్డుకు ఇరువైపులా ఇక్కడ సామాన్యులకు చోటులేదు అనిపించేత పెద్ద దుకాణాలు కనిపించేవి. ముఫ్ఫై సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో పెద్దగా కాలుష్యం ఉండేది కాదు. నగర శివార్లలో పెద్దగా జనం నివసించేవారు కాదు. హైదరాబాద్ నగరంలోని ప్రజల జీవితం ఉగాది పచ్చడి తిన్న అనుభూతి కలిగేది. నెలలో జీతం వచ్చిన తర్వాత మొదటి పది రోజులు హాయిగా ఉండేది.
ఆ జీతం డబ్బులు అయిపోయాక మళ్ళీ జీతం కోసం ఎదురు చూపులు. అంతా మనవాళ్ళే కానీ ఒకరికొకరు సాయం చేసుకోలేని ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి మారలేదు. ఏదిఏమైనా ఆ నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది.
– వెంకట భానుప్రసాద్ చలసాని