తొలి ప్రేమ లేఖ

తొలి ప్రేమ లేఖ

ఓ వెన్నెలా..

ఏ అద్భుత సోయగం నీలో నచ్చి
నిన్ను నేను ఇష్టపడ్డానో..
ఏ చిరునవ్వు నీలో మెచ్చి నీకు
దాసుడనయ్యానో..

నీ కలువ కన్నులతో నన్ను కవ్వింపజేసి..
నీ మధుర ఆధరాలతో నన్ను మురిపింపజేసి..
నీ చందన చెక్కిళ్ళతో నన్ను మైమరపింపజేసి..

జక్కన చెక్కని చక్కని శిల్పం లా..
చీకటి ముసుగున దాగిన వెన్నెలలా
తొలికరి చినుకుల అలజడిలా
పలికిన చిలకల అలికిడిలా..

ముగ్ద మనోహర రూపంతో..
ముద్ద మందారపు అందంతో..
వాలుజడ వయ్యారపు సిగలో
విరజాజులని మాల నింపుకుని..

నీ ముసిముసి నవ్వులలో
ముత్యాలు దాచుకుని ..
నీ ఓర చూపులలో
ఇంద్రధనుస్సు వర్ణాలు నింపుకుని..

వయ్యారాల తోటలో నీ వయస్సు
ఉయ్యాలలూగుతుంటే..
సయ్యాటలాడే ఈ మనస్సు
నీకై పరితపించడం తప్పేమీ కాదేమో..

అగుపించి నవ్విస్తావు..
నవ్వించి కవ్విస్తావు..
కవ్వించి మురిపిస్తావు..
మురిపించి నా బాధలు మరిపిస్తావు..

ఎన్ని సిరా చుక్కలు కలిపితే
నీ రూపాన్ని వర్ణించగలను..?
ఎన్ని అరుణ కిరణాల వేడిమితో
నీ కఠిన మనసును కరిగించగలను..??

ఎన్ని చందమామలు నీకు బహుమతిచ్చి
నీ కోపం చల్లార్చగలను..??
ఎన్ని చుక్కలను పట్టి తెచ్చి నీ చక్కని
ప్రేమను నేను పొందగలను..??

అందుకే..

వెలకట్టలేని నీ ప్రేమకు..
వెలకట్టకూడని నా మనసును ఇస్తూ..
అక్షరమాల అల్లుతూ.. ఈ అక్షరలిపి సాక్షిగా..
అందమైన ప్రేమలేఖ వ్రాసి నీకు పంపిస్తూ…

నిన్ను నేను ప్రేమిస్తున్నాను..
అని చెప్పకనే చెబుతున్నాను.. చెలీ.

 

-ఆదిత్య శివశంకర కలకొండ

0 Replies to “తొలి ప్రేమ లేఖ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *