అరణ్య రోదన

అరణ్య రోదన

తెల్లవాడి కబంధహస్తాల
నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుని

వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న
భారతీయులకు సిద్ధించింది
అసలైన స్వాతంత్రమా?
ఆది నుంచి సంస్కృతి నాగరికతలకు ప్రపంచంలోనే

పట్టుగొమ్మగా ఉన్న భారతదేశ ఆకర్షణ విశ్వ

యవనికపై క్రమక్రమంగా మసకబారుతోంది
శాస్త్ర సాంకేతికంగా
పెను పురోగతి సాధించినా
పరోక్షంగా అజమాయిషీ చేసే

కార్పోరేట్ శక్తుల విషవలయంలో చిక్కుకుని విలవిలలాడుతోంది
నా విలక్షణమైన దేశం!
ప్రపంచీకరణతో వర్తక వాణిజ్యాలు

విశ్వవ్యాప్తమైనా ఆర్థిక పెట్టుబడులు సరిహద్దులు దాటి

ప్రవహిస్తున్నా సామాన్యుడి రూపురేఖలు, ఆహార విహారాలు కించిత్తు మారలేదు
దారిద్యరేఖకు దిగువన కొట్టుమిట్టాడుతూ ఐదేళ్ల ఓట్ల పండుగకు వచ్చే తాయిలాల
కోసం తహతలాడుతున్న అసహాయులకు ఆశ్రమం ఈ దేశం
అంబరాన్ని దాటుతున్న అభివృద్ధి సంబరాల రొదలలో పేదవాడి
ఆకలి కేకలు నిరుద్యోగి ఆవేదన రోదనలు అరణ్య రోదనలుగా మిగిలిపోవాల్సిందేనా?

 

– మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *