జాతీయ పండుగ
రవి తన తాతతో “తాతా, స్వాతంత్ర దినోత్సవం మన జాతీయ పండుగ అని అంటున్నావు కదా. స్వాతంత్ర దినోత్సవం భారతీయులు ఎందుకు జరుపుకుంటారో చెప్పవా” అని అడిగాడు. అప్పుడు తాత రవితో “ఆగస్టు పదిహేను మన దేశపు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1947 ఆగస్టు పదిహేనవ తారీఖున భారతదేశం రెండు వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విముక్తి పొందింది. దానికి గుర్తుగా స్వాతంత్రనంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తారీఖున భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుతోంది. ఆ రోజు జాతీయ శెలవు దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. దేశంలో అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు” అన్నాడు తాత.
అప్పుడు రవి తన తాతతో. “మా స్కూలులో కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని మేము చాలా ఘనంగా జరుపుకుంటాము తాతా. మా ప్రిన్సిపాల్ గారు దేశ నాయకుల గురించి మంచి ఉపన్యాసం ఇస్తారు” అన్నాడు. అప్పుడు తాత, “దేశనాయకులు అంటే గుర్తుకు వచ్చింది. నేను నెహ్రూ గారి ఉపన్యాసం విన్నాను. మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ గారు చేసిన ఉపన్యాసం యొక్క ఆడియో నా దగ్గర ఉంది. అది నీకు వినిపిస్తాను” అన్నాడు రవితో.
రవి వెంటనే, ” వినిపించు తాతా. నాకు ఆ ఉపన్యాసం వినాలని ఉంది” అన్నాడు తాతతో. తాత టేప్ రికార్డు ఆన్ చేసాడు. నెహ్రూ గారి ఉపన్యాసం వినపడుతోంది “అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం యిప్పుడు ఆసన్నమయింది. అర్థరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే, ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెందివున్న సమయాన, భారతదేశం, పునరుజ్జీవనంతో, స్వేచ్ఛగా స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది” అని నెహ్రూ గారు పలికిన మాటలు వినవచ్చాయి.
ఆ మాటలు విని తాతతో పాటు రవి కూడా పులకించిపోయాడు. నిజంగా ఎంత అద్భుతమైన ఘట్టం అది.
రవి తన తాతతో కలసి “భారత్ మాతాకీ జై. వందేమాతరం” అని గట్టిగా అరచి తమ దేశభక్తిని చాటారు.
– వెంకట భానుప్రసాద్ చలసాన