వినిపించని కాలం పిలుపునకై…!!
కదిలే దేహం కనికరింపైనా
తరిగే రోజులకు ప్రయానమది…
వెన్నెల వెలుగులు పున్నమి రాత్రులు
కాలం చెప్పిన కథలు వింటూనే…
నెగ్గిన అసాధ్యాలతో నిలువని
సమయమిచ్చిన బహుమానమే
ఈ శరీరానికి ముసలితనం…
ఒడి నింపుకొన్న ఎన్నో తర్ఫీదులను
ఒలకనీయక…దర్పణం కాని వేషంతో
కప్పకోని కౌఠిల్యం తో నిర్ణయం కాక…
విడిది చేయని విలువలతో ఓడిపోక
సూచికలు చేసిన దిక్సూచితో
కొలతబడుతు…ఎడబాటు చేయని కాలం
తీర్పు వయస్సుకు కొలమానమే…
మనిషి మనుగడలో అనుభవాల
జ్ఞాపకాలు ఉలిక్కిపడిన రోజులు…
జరిగిన కలలుగా కరిగిపోయే ఆనంద
భాష్పాలేనని వైరాగ్యాన్ని గుచ్చుకొంటు
చేయని చేయూతతో చతికిలపడుతు…
ఉడిగిన శక్తుల ఉబలాటం ఊతకర్ర
పొడుపులతో మూడుకాళ్ళ బంధాన్ని
సాగించక తప్పదు…
కనుబొమ్మలపై ఆన్చిన అరచేయి
క్రింద నీడన దూరమవుతున్న
బంధాలను పిలుచుకొంటు…ఊరు
వద్దంటున్నా వల్లకాడు రమ్మంటున్నా…
తెలియని మమకారమేదో తెగిపోక
ముడిపడుతున్న సంతతితో…వెలితి
నింపని మనస్సుగా వినిపించని కాలం
పిలుపునకై ఎదురు చూడాల్సిందే…
– దేరంగుల భైరవ