ఆఖరి శ్వాస
నిర్మల నిశ్శబ్దం..
నిగూడ అంధకారం!
చీకటిదారులలో ఇరుకు
సందులలో శిధిలమైన
మొండి గోడల నడుమ
అస్తవ్యస్త ప్రయాణం!
దీపస్తంభం ఆసరా లేదు!
నక్షత్రాల మినుకు మినుకులు లేవు!
ఏ ఉదయపు కాంతి కోసమో
ఏ వెలుగుల గమ్యం కోసమో!
భరోసా ఇచ్చే హస్తం
బాధ్యతగా వచ్చే నేస్తం కోసం
సాగిస్తూనే ఉన్నాను
ఆగని పయనం!
చీకటి తెర తొలగింది!
తెలతెలవారిపోయింది!
రవితేజుడు రగిలిపోతున్నాడు!
రోడ్ల తారు కరిగిపోతోంది!
నేనున్నాననే తోడు లేదు!
మండువేసవి నిర్మానుష్యం
బీటలు వారుతున్న భూతలం! దాహార్తితో పరితపిస్తున్న
హృదయ తాపం !
భరోసా ఇచ్చే హస్తం
కోసం సాగిస్తూనే ఉన్నాను
బతుకు సమరం!
ఒకనాడు సందడిగా,
సజీవంగా కళ్యాణ శోభతో
కళకళలాడిన కనకపు
మేడల వీధులు నేడు
కాష్టాల గడ్డను తలపిస్తున్నాయి!
అర్చకుపోయిన కళ్ళలో
అశ్రుభాష్పాలు కూడా
ఆవిరైపోయాయి!
అయినా సాగుతూనే ఉన్నాను అలుపును రానీయక
ఆశావాదాన్ని వీడక
అంతిమ గమ్యం కోసం
ఆఖరి శ్వాస వరకు!
-మామిడాల శైలజ