జీవిత పాఠాలు
ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో కారణాలేమైనా గాని మనిషి రాను రాను అతి సున్నితమైన మనస్కుడిగా మారిపోతున్నాడు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా స్పందించి మనసును చిన్నబుచ్చుకోవడం, మదనపడడం సర్వసాధారణం అయిపోయింది.
ఇంట్లో అమ్మ తిట్టిందనో, నాన్న ఒక మాట అన్నాడనో, సెల్ ఫోన్ కొనియ్యలేదనో, చెల్లెలు టీవీ రిమోట్ ఇవ్వలేదనో మనసు పాడు చేసుకుని ఆత్మహత్యల వరకు వెళ్లిన సంఘటనలు నిత్యం మనం దినపత్రికలలో, వార్త మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాము.
ఇక పరీక్షల ఫలితాల వచ్చాయంటే ఆత్మహత్యల దిశగా పోకుండా ఉండడం కోసం ముందుగానే విద్యార్థులకు కౌన్సిలింగ్ తరగతులు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
అయినప్పటికీ కూడా ఎగ్జామ్స్ ఫలితాల తర్వాత కనీసం అరడజను వరకు అయినా ఆత్మహత్యల సంఘటనలను చూస్తూ ఉన్నామ.ఇది ఎంతో మనసులను కలచివేసే విషయం.
మొన్నటికి మొన్న ఒక అబ్బాయి నీట్ లో సరైన ర్యాంకు రాలేదని అమెజాన్ లో పాయిజన్ ఆర్డర్ పెట్టుకొని మరి సూసైడ్ చేసుకున్నాడు. ఒక అబ్బాయి డిగ్రీ పరీక్షలలో కాపీయింగ్ చేస్తూ పట్టుబడితే నలుగురిలో ఇన్విజిలేటర్ నానా మాటలు అన్నాడని రైలుకు ఎదురు వెళ్లి మరి అత్యంత దారుణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలా రాను రాను మనిషి అతి సున్నిత మనస్కుడిగా తయారవుతున్నాడు. పిల్లలను పంజరంలో పక్షులుగా, గాజు బొమ్మలుగా ఎటువంటి కష్టాలు, బాధలు తెలియకుండా పెంచడం వల్ల
లోకం పోకడ తెలియక జీవితం పట్ల సరైన అవగాహన లేక చిన్నచిన్న మాటలకే మదన పడుతూ అత్యంత పాశవికమైన నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు శాశ్వతంగా కడుపుకోతను మిగులుస్తున్నారు.
ఈ మనోభావాలు దెబ్బ తినడం అనేది పిల్లలకు,విద్యార్థులకు మాత్రమే కాదు ఎంతో జీవితాన్ని చవిచూసిన పెద్దవాళ్ళు కూడా బాస్ అమర్యాదగా మాట్లాడాడని, ప్రమోషన్ రాలేదని ,
తోటి ఉద్యోగి అవమానించాడని జాబ్స్ లో టార్గెట్స్ చేరుకోలేదని, మరియు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, మరి కొన్ని సందర్భాల్లో భార్య పుట్టింటికి వెళ్లిందని, వివాహ బంధం విచ్ఛిన్నమైందని, ప్రేమ వ్యవహారాలలో వైఫల్యం చెందామని ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు అనేకం.
కాబట్టి పిల్లల్ని చిన్నప్పటి నుంచే జీవితం అంటే ఏమిటో తెలిసేట్లుగా అన్ని విషయాలలో రాటుదేలే లాగా పెంచడం మంచిది.
అప్పుడే ఈ ఒడిదుడుకుల సమాజంలో ఒత్తిడిలమయం అయిపోయినటువంటి బిజీ జీవిత శైలిలో వాళ్ళు నిలదొక్కుకొని మానసికంగా ఎదురయ్య సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అస్త్రశాస్త్రాలతో వారు జీవితంలోకి ప్రవేశించగల శిక్షణ ఇవ్వడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం.
–మామిడాల శైలజ