స్మృతుల సంఘీభావంతో…!!!
కొయ్యలు బారని బతుకు వేదాన్ని
అస్తికత్వానికి దారి చేసుకో…నువ్వొక
మనిషివని నీలో మానవత్వం నడిచేదారని
నీ ప్రయానం ప్రపంచాన్ని రచించాలని…
కలంపోటుతో కాలమవుతు నిజాలను
తెలిపిన ఆగని పిలుపులతో సమయంగా
చివరి దారికి చేరుకో…
కలల రాగాలు కల్పితపు సుడిగుండాలు
పిలువని వసంతాలు దారి తెలియనివై…
వేదనలు నిండిన రోజున యతలకు చోటిస్తే
కనిపించని కారడవిన దారి దోపిడీకి
గురవుతు…వెలగని అమావాస్యలను
వేదికలపై అలంకరణ చేసి…బతుకు
దారి పొడవునా ఊరేగించు కోలేవు…
క్షణం ఆగనిది అట్లని బతుకు దారిని
చూపేది కూడా…విషయ ఆలాపనలను
ఏకాంత సేవలతో తుల్యం చేసుకో
నిత్యం నీలోనిదే బతుకే దారి ఒక అవకాశమే
నిన్నటి గడువు నేటికి దుఃఖం కారాదు
నేటి గమనం నయనానంద కారమై
స్మృతుల సంఘీభావంతో బతుకు దారిని
నిర్మించుకో…
వెల్లువతో ప్రకృతి తలుపులు తెరుస్తు…
విరబూసిన ఆశయాలతో నవ యుగపు
వారసత్వాన్ని ఆహ్వనిస్తు…బానిసత్వపు
దారులకు ఉరిమే ఉత్సాహాలతో సంకెళ్ళను
తెంచుతు…వెలుగున కట్టిన గూటికి
దారవుతు అందరిలో సగం నువ్వేనని
అందరి కొరకు నీదొక చేయని…నలుగురితో
బతుకు దారిని నడిపించుకో…
– దేరంగుల భైరవ