ముందు అడుగు
నా లోపాన్ని నయం చేస్తానని అని చెప్పి
మా నాన్నతో అన్ని అవసరాలను తీర్చుకొని
మా దగ్గరకి వచ్చినప్పటికీ మర్చిపోయాను అని చెప్పి
తప్పించుకొని తిరుగుతున్నారు..
నేను కూడా వాళ్ళని నమ్మి
నా జీవితం మీద ఎన్నో కలలు కన్నాను..
నా లోపాన్ని ఎగతాళి చేసిన వాళ్ళకి
బుద్ధి చెప్పాలనుకున్నాను..
నా టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలనుకున్నాను…
ఎన్నో కబుర్లు చెప్పి మమ్మలను నమ్మించి
అవసరాలు తీర్చుకొని నీటి మూట చేసేసి
వెళ్ళిపోయారు..
ఏదో తెలియని శూన్యంలోకి నేను వెళ్ళిపోయాను
నేను కలగన్న ప్రపంచం నిజం కాదని
నాలో నేను ఎంతో కృంగిపోయి
అసలు గమ్యం ఏంటో తెలియని పరిస్థితిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్షణంలో
ఒక స్నేహితుడి రాకతో నా జీవితం అందమైన రంగుల పుస్తకం అయిందని ఆనందపడ్డాను.
ఆ పుస్తకాల్లో ఉన్న అక్షరాలతో నా జీవితాన్ని కలుపుకుంటూ ముందు అడుగు వేశాను.
అప్పుడు నా లోపం అనేది మర్చిపోయి అక్షరం అనే కలం తో జీవితం పంచుకుంటున్నాను.
- మాధవి కాళ్ల