ఆత్మ త్యాగం
ఆక్రోషం వరదలై
ఆవేదన పొంగి పొర్లి
ఆశాభంగం కలిగిన చోట
నమ్మకద్రోహం మనసును
నలిపిన చోట శిశిరాల
దారుల్లో చిగుర్లు రాలినవేళ
మాటల గాయాలకు మది
తల్లడిల్లి సుకుమార
హృదయం చిద్రమైనవేళ
వేదనతో కన్నీటి చెలిమలు
ఉబికిన చోట కాడువాసనలు
కమ్ముకున్న వేళ
మురికి ఆలోచనల కమురు ముసురుకున్న వేళ
ఆశలు రాలిన చోట
ఆత్మక్లేశం కలిగిన చోట
కుళ్ళు కుతంత్రాలు
ఒళ్ళు విరుచుకొని
రక్తపిపాసులు రెక్కలు
విరుచుకొని కాష్టాలగడ్డలో
నిర్భాగ్యుల రోదనలు
మిన్నంటిన వేళ ఇలా
అనుక్షణం ప్రతి క్షణం
గుర్తుకు వస్తూనే ఉంటారు!
ఉర్వితలంపై వెలసి
ఉరితాడును
ముద్దాడిన అమరుల్లారా!
ఆత్మత్యాగంతో నేలను
పునీతం చేసిన వీరుల్లారా!
-మామిడాల శైలజ