లివ్ ఇన్ రిలేషన్

లివ్ ఇన్ రిలేషన్

ఏంట్రా నువ్వు మాట్లాడేది అంది సునీత. అవునమ్మ నేను పెళ్లి చేసుకోను అన్నాడు ప్రదీప్, పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటావు? ఏం చేస్తావు అన్నాడు తండ్రి రఘునాథ్ గారు. నాన్న నేను పెళ్లి చేసుకోను, నేను చిన్నప్పటి నుండి మీ అందర్నీ చూస్తున్నా. నాకు పెళ్ళి అంటేనే విరక్తి కలిగింది మిమల్ని చూస్తేనే విరక్తి కలిగింది.

పెళ్లి, పెళ్లి అంటారా పెళ్లి అయ్యాక కొన్ని నెలలు బాగుంటారు. ఓ పిల్లా పిల్లాడో పుట్టాక. ఇక మొదలు కష్టాలు అది లేదు ఇది లేదు అంటూ నానా అగచాట్లు. దానికి చీరలు తెస్తే నచ్చదు పోని నువ్వే కొనుక్కో అంటే కొనను అంటుంది. నా పుట్టింటికి వెళ్తాను అంటుంది పంపిస్తే ఎవరితో సంబంధం అంట గడుతుంది పంపక పోతే అనుమానం మనిషి అని సాధిస్తుంది.

ఇక ఉమ్మడి కుటుంబం అయితే చెప్పనక్కర్లేదు అత్త కోడళ్ళ గొడవలు, తోడి కోడళ్ళ గాలటాలు, చాడీలు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో డబ్బులు ఇస్తే ఒక బాధ దాన్ని అడుక్కోవలి ఇవ్వకపోతే రూపాయికి కూడా అడగాలి అని అంటుంది నా ఇంట్లో నేనే పని మనిషిని అని చెప్పుకుంటుంది.

వామ్మో ఆ నరకం నేను భరించలేను, అదిగో ఎందుకు చేసుకోవ అంటున్నావు కానీ నీ ముందే ఉంది నీ ముద్దుల కూతురు, పెళ్ళైన నాలుగేళ్లకు వచ్చింది. కొట్టాడు అని రేప్పొద్దున నా పెళ్ళాం కూడా ఇంతే ఏదో కోపంలో చెయ్యి చేసుకుంటే వచ్చేయడమేనా, ఇవ్వన్నీ చూసే నేను చేసుకోను అంటున్నా నా నిర్ణయం మారదు.

నాకు సంభంధాలు చూడకండి నా జీవితం నేను బ్రతుకుతాను ఇక వెళ్తాను మీరు ఫోన్ లు కూడా చేయకండి నాకు అంటూ…. బ్యాగ్ తో బయటకు వెళ్ళాడు ప్రదీప్. తల్లిదండ్రులు బిత్తరపోయి చూస్తూ ఉండి పోయారు. ఆన్న తన గురించి అనగానే నేను మాటలు పడడానికి రాలేదు అంటూ కూతురు కూడా బ్యాగ్ సర్దుకుని వెళ్ళింది.

ఆ తల్లిదండ్రులు ఇద్దరు తమ ప్రమేయం ఏమీ లేకుండానే అలా చూస్తూ ఉండిపోయారు.

*********

ఇక ప్రదీప్ తన ఉద్యోగం సాఫ్ట్వేర్ కాబట్టి తనకు ఆఫీస్ లో నచ్చిన హరిణిని ఇష్టపడ్డాడు. హరిణి కూడా ఇష్టపడడంతో ఇద్దరు మాట్లాడుకుని ఒకే ఇంట్లో ఉండడం మొదలు పెట్టారు. ఆరు నెలలు ఎలా గడిచాయో ఇద్దరికీ తెలియలేదు. లాంగ్ డ్రైవ్ లు, పార్టీలు, పబ్బులు, స్నేహితులతో హంగామా కలిసి ఇట్టే గడిచిపోయాయి.

ఆరు నెలల తర్వాత హరిణి పేరెంట్స్ హఠాత్తుగా వచ్చారు ప్లాట్ కి రావడంతోనే మా పిల్లని మాయ చేసి అడిస్తావా అంటూ తిట్టారు. పోలీస్ కేసు పెడతాము,పెళ్లి చేసుకో అంటూ బెదిరించారు. కానీ ప్రదీప్ నేను చేసుకోను ముందే తనకు అన్నీ చెప్పాను మేము సహా జీవనం మాత్రమే చేశాం అని అన్నాడు.

దాంతో ఏరా సహా జీవనం చేయడానికి ఇది ఫారిన్ కాదు. ఇప్పుడు దాన్ని అన్ని విధాలా వాడుకుని వదిలేస్తే ఎవడు చేసుకుంటాడు దాన్ని, ఏముందని చేసుకుంటాడు. నా కూతుర్ని పీల్చి పిప్పి చేసావు, ఇప్పుడు చేసుకుంటావా లేదా అంటూ బెదిరించినా చేసుకోను అంటూ తేల్చి చెప్పాడు. దాంతో హరిణి అతని దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్లు నాతో ఉన్నావు ఒక్కసారి కూడా ప్రేమ కలగలేదా నాపై అంటూ అడిగింది.

లేదు అన్నాడు నిర్లక్ష్యంగా ప్రదీప్. ఛీ అంటూ అమ్మా పదండి అని వారితో వెళ్ళిపోయింది హరిణి. హా పొతే పో నా జీవితం నా ఇష్టం అంటూ కాస్త మార్పు గా ఉంటుంది అనుకుంటూ తన ఊరికి ప్రయాణం అయ్యాడు ప్రదీప్.

ఊర్లోకి అడుగు పెట్టగానే పెద్ద మార్పులు ఏమి కనిపించలేదు కానీ అందరూ తనని విచిత్రంగా చూడడం, వారిలో వారే చెవులు కొరుక్కోవడం వింటూ ముందుకు కదిలాడు. కొందరు మాత్రం బాహాటంగానే ఏరా పెళ్లి అంటే పారిపోయావు అంట నీకు మ్యాటర్ లేదట కదా అంటూ పెద్దగా అరుస్తూ మాట్లాడడం వింటూ బిత్తరపోయాడు. ఏంటి నేను పెళ్లి చేసుకోక పోతే మ్యాటర్ లేదా వారికేం తెలుసు నేను హరిణితో ఎంత ఎంజాయ్ చేశానో అని మనసులో నవ్వుకున్నాడు.

ఇంటికి వచ్చిన ప్రదీప్ తో తల్లి, తండ్రి కూడా సరిగ్గా మాట్లాడలేదు. చెల్లెలు తన కొడుకును తీసుకుని లోపలికి వెళ్ళింది. లోపల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరూ కొన్ని నీళ్ళు కూడా ఇవ్వలేదు. సరే అనుకుంటూ తానే అమ్మా అన్నం పెట్టు స్నానం చేసి వస్తా అంటూ బ్యాగ్ రూమ్ లో వేసి బాత్రూం లోకి దూరాడు.

ఎందుకు వచ్చాడో ఏమో మనకు ఎలా తెలుస్తుంది అయినా అన్నయ్య నడక చూసావా అమ్మ ఎంత మారిందో నిజమే కాబోలు మనకు ఏవో సాకులు చెప్పాడు కానీ అందరూ అంటే మా అత్తగారు, చిన్నమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ వాళ్ళు అన్నట్టే వీడు ఆడంగి వాడు. వీడు ఉన్నప్పుడు నేను ఉండలేనే అమ్మా, వాడు వచ్చాడు అని తెలిసి ఉంటే మా అత్తగారు తిడతారు.

ఇప్పటికే వీడి వల్ల రోజూ మాటలు పడుతున్నా, నేను వెళ్తాను మధ్యాహ్నం బస్సుకు అంటున్న చెల్లెలి మాటలు వింటూ ఆ ఎవరేం అనుకుంటే మనకేంటి మన గురించి మనకు తెలుసు కదా, అది చాలు అనుకుంటూ స్నానం చేసి వచ్చాడు.

అమ్మా అన్నం పెట్టావా అనగానే తల్లి ప్లేట్ లో అన్నం పెట్టి కూరలు వేసి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఇంతలో చెల్లెలు బ్యాగుతో వచ్చి నిరసనగా చూస్తూ ఒక్కమాట కూడా మాట్లాడకుండా తన అత్తారింటికి వెళ్ళిపోయింది. పోతే పోనీ నాకేంటి అనుకుంటూ అన్నం తిని, చాలా రోజుల తర్వాత పెరట్లో మంచం మీద వేప చెట్టు కింద పడుకున్నాడు ప్రదీప్.

సాయంత్రం ఏడు అవుతుండగా మెలకువ వచ్చింది. అయ్యో ఇప్పటి వరకు నన్ను అమ్మ లేపలేదెంటో అనుకుని లేచి, రెఢీ అయ్యి బయటకు వచ్చాడు. ఇంటి ముందు అప్పటి వరకు నాన్నతో మాట్లాడుతున్న కొందరు ప్రదీప్ రావడం చూసి మేము రేపు వస్తాం రఘు నాథ్ గారు అంటూ ప్రదీప్ ను విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోయారు. అదేంటి అలా వెళ్తున్నారు నా ముందు మాట్లాడకూడనివి ఏముంటాయి అంటూ నాన్న ఎలా ఉంది వ్యవసాయం డబ్బు ఏమైనా కావాలా అంటూ అడిగాడు తండ్రిని.

తండ్రి ప్రదీప్ వంక చూసి డబ్బులు నాకేం అవసరం లేదు. కానీ నీకు సంబంధం చూడమంటవా అంటూ అడిగాడు. కొడుకు మనసు మారిందో ఏమో అని, నాన్న ఒక్కసారి మీకు చెప్పాను కదా, చేసుకోను అని ఇంకెందుకు అడుగుతారు. ప్రశాంతంగా రెండు రోజులు ఉండి పోతా అంతే పెళ్లి అంటే ఇప్పుడే వెళ్ళిపోతా అన్నాడు ప్రదీప్.

అది కాదు రా ప్రదీప్ ఒంటిగాడిలా ఎన్నాళ్ళు ఉంటావు. ఇలా ఉండడం వల్ల నీకేదో లేదని అందుకే పెళ్లి వద్దు అంటున్నావు అని నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు ఇలా ఉండకు రా… నా మాట విని పెళ్లి చేసుకో తర్వాత బాధ పడతావు అన్నాడు తండ్రి హితోక్తి చెప్తూ….

లేదు నాన్న నాకే లోపమూ లేదు. నేను హరిణి అనే అమ్మాయితో ఇన్నాళ్లు రిలేషన్ లో ఉన్నాను. ఎంజాయ్ చేశాను. తను ఇప్పుడు లేదు అనుకో, పెళ్లి చేసుకో అని పోరు వద్దు చేసుకోను అనగానే వెళ్ళిపోయింది. అది పోతే ఇంకోతి, పిచ్చిది నాతో ఉంటే ఎంజాయ్ లైఫ్ అని తెలుసుకోలేక పెళ్లి అనే జంజాటం పెట్టాలని అనుకుంది. ఎలాగో వదిలించుకున్నా ఇప్పుడు మీరు కూడా అంటున్నారు. నాకు ఇష్టం లేదు నాన్న పెళ్లి అన్నాడు ప్రదీప్.

ఇదంతా వింటున్న తల్లి వచ్చి నీకూ అవసరం లేదేమో కానీ మాకున్న ఒక్కగానొక్క కొడుకువి మాకు కావాలిరా నీ పిల్లల్ని చూడాలి, ఆడించాలి నలుగురు అనుకున్నది నిజం చేయకురా… సంబంధం చూస్తాను కావాలంటే నీ భార్యను ఇక్కడే ఉంచి వస్తూ పోతూ ఉండు అంది తల్లి బుజ్జగిస్తూ, ఏహే ఆపమ్మా వద్దు అంటుంటే చూస్తా అంటావు అందుకే ఇక్కడికి రాబుద్ది కాదు.

రేపు పొద్దున్నే వెళ్తా ఇక మళ్లీ రాను నేను అన్నాడు కోపంగా, అది కాదు రా ఒంటరి జీవితం మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తోడు కావాలి అనిపిస్తుంది. నువ్వు అన్నట్టు సహజీవనం చేస్తే అది నాలుగు రోజులు ఉండి పోతుంది అంతే గానీ సహధర్మచారిని కాలేదురా మేము నీ మంచికే చెప్తున్నాం వినరా అంటూ బ్రతిమాలింది తల్లి.

తల్లి నీకొక దణ్ణం నన్ను వదిలేయండి. నేను ఇంకా చాలా సంపాదించాలి. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అవన్నీ కావాలంటే బంధాలు ఉండకూడదు. నన్ను వదిలేయండి అంటూ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు ప్రదీప్. తల్లిదండ్రులు కూడా ఏమి అనలేక మౌనంగా ఉండిపోయారు. తెల్లారి వెళ్తున్నప్పుడు కూడా మౌనంగానే ఉన్నారు వాళ్ళు, డబ్బు అవసరం అయితే వాళ్లే ఫోన్ చేస్తారు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ప్రదీప్.

*********

కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టుగా ప్రదీప్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అయిదేళ్ల కాలంలో తల్లి చనిపోయినప్పుడు మాత్రమే ఊరికి వెళ్ళాడు. తర్వాత మళ్లీ వెళ్లలేదు.

చాలా బిజీ అయ్యాడు. పొద్దంతా కాన్ఫరెన్స్ లతో, రాత్రి పార్టీలతో బిజీగా అయ్యాడు. దానితో పాటూ అతని వయసు పెరగడం, అలవాట్లు తప్పిపోవడం తో ఆరోగ్యం మందగించింది. చూపు తగ్గి కళ్లద్దాలు, తాగడం, కంట్రోల్ లేకుండా తినడం వల్ల లావయ్యాడు. ఏవేవో సమస్యలు వచ్చాయి.

షుగర్, బీపీ లాంటివి పెరిగాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు, కానీ సమయానికి గుర్తుకు రాక కొన్ని సార్లు వేసుకుని కొన్ని సార్లు వేసుకోక నెగ్లెట్ చేశాడు.

చివరికి అతను లావు అవడంతో డబ్బు కోసం తప్ప అతన్ని ప్రేమగా పలకరించే అమ్మయిలు లేకుండా పోయారు. పెద్ద బిల్డింగ్, కారు, హోదా అన్ని వచ్చాయి. ఇంటికి రాగానే పనోడు వండిన చప్పిడి కూడు అది కూడా చల్లగా అయ్యిందే వేడిగా వండలేవా అంటే మీరు ఎప్పుడు వస్తారో తెలియదు అంటూ సాకులు. ఇంట్లో ఉన్న డబ్బు పోవడం లాంటివి ఎదురయ్యేసరికి ప్రదీప్ కి నీరసంగా అనిపించింది.

ఒక్కసారి హరిణి ఎలా ఉందో చూడాలనే కోరిక కలిగింది. నన్ను కాదని వెళ్ళింది ఇప్పుడు నన్ను చూసి నా ధనం చూసి బాధ పడుతుంది అని అనుకుంటూ హరిణి దగ్గరికి అడ్రస్ కనుక్కుని మరీ వెళ్ళాడు. కుటీరం లాంటి ఇల్లు ముందు గేట్ ముందు చక్కగా అలికి అందమైన ముగ్గులతో ప్రశాంతంగా అనిపించింది. లోపలికి వెళ్తుంటే అటు ఇటూ పక్కగా పెరిగిన పువ్వులు అందంగా పలకరించాయి.

ఎవరూ అంటూ గేట్ చప్పుడుకి బయటకు వచ్చింది ఒక మధ్య వయసు ఆవిడ. నుదుట కుంకుమ తో, పచ్చని గాజులు చేతినిండా వేసుకుని, కొప్పున మల్లెలు చుట్టి ఆకుపచ్చని కాటన్ చీరలో అందంగా ఉంది. సన్నగా బొద్దుగా కాకుండా మధ్యస్థంగా ఉంది.

ఆమెని చూస్తూ ప్రదీప్ హరిణి ఇక్కడ అంటుంటే నేనేనండి నాతో ఏం పని మీకు అంటుంటే ఎవరూ వచ్చింది అంటూ ఒక మధ్య వయసు వ్యక్తి ఖద్దరు పంచ లాల్చీ తో వచ్చాడు. కళ్లద్దాలు సర్దుకుంటూ, తనని తాను పరిచయం చేసుకున్నాడు ప్రదీప్.

ఏంటి నువ్వు ప్రదీప్ వా? ఎంటి ఇలా అయ్యావు? ఇంత లావుగా పొట్టతో తయారయ్యావు ఓహ్ బాగా సంపాదించినట్టు ఉన్నావే,పెళ్లి చేసుకున్నావా అంటూ తను భర్తకి ఏదో చెప్పి, కూర్చో ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది.

హరిణి భర్త హరీష్ తన పేరని తాను పెయింటింగ్స్ వేస్తాను మీ గురించి హరిణి చెప్పింది నాకు అంటూ మాకు ముగ్గురు పిల్లలు అందరికీ దాదాపు పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు నాకు తను, తనకి నేను తోడుగా ఉంటున్నాము, జీవితం ప్రశాంతంగా ఉంది అంతా నా హరిణి వల్లే అంటూ హాయిగా నవ్వుతున్న అతన్ని చూసి జెలసీగా అనిపించింది.

ఇంతలో హరిణి కాఫీ తీసుకుని వచ్చింది ముగ్గురికి సరిపడా కాఫీ కలుపుతూ షుగర్ వెయ్యనా అంటూ అడిగింది. వద్దు అన్నాడు. సరే అంటూ వారిద్దరికీ షుగర్ వేసుకుని సుగర్ లేని కాఫీ తనకు ఇచ్చింది. అమ్మాయి ఫోన్ చేసింది అందుకే కాఫీ ఆలస్యం అయ్యింది అంటూ భర్తకి చెప్పేసరికి హా చిటికెలో వచ్చేదానివి ఇంత లేట్ అనుకుంటేనే అనుకున్నా ఇంతకీ ఏంటంట అన్నాడు హరీష్.

రాత్రికి ఇక్కడికే వస్తున్నారట, నన్ను వంట చేయకు వెన్నెల్లో కలిసి కూర్చుని అందరం సరదాగా తిందాం అంది అంటూ నవ్వుతూ చెప్పింది. అంతేలే నీ కూతురు కదా అన్నాడు హరీష్. వాళ్ళు అలా నవ్వుతూ మాట్లాడుకోవడం పిల్లల గురించి చెప్పుకోవడం, పిల్లలు అనగానే వారి మొహాల్లో వచ్చిన కాంతులు చూస్తున్న ప్రదీప్ కు తానేదో కోల్పోయాను అనే బాధ ఎక్కడో కలుక్కుమనే భావనతో ఇక అక్కడ వుండలేక ఒకే నేను వెళ్తాను అంటూ లేచాడు.

అదేంటి ఈరోజు మాతో ఉండిపోండి అంటున్న హరీష్ ని వారిస్తూ హరిణి మీరు ఊరుకోండి అతను తన బిజినెస్ వాదిలి రాలేడు, ఇప్పుడు కూడా ఇక్కడ ఏదో బిజినెస్ పని మీదే వచ్చి ఉంటాడు. అతనికి పెళ్లి అన్నా, పిల్లలు అన్నా చిరాకు లెండి అంది హరిణి ఆ మాటలు ప్రదీప్ కు చెంప పెట్టులా అనిపించాయి.

ఏమి అనలేక నవ్వుతూ హా అదే అదే వెళ్ళాలి రేపు మీటింగ్ ఉంది అంటూ బయలుదేరాడు. సరే అంటూ సాగనంపారు ఇద్దరూ….

కారు ఎక్కిన ప్రదీప్ వారి ముచ్చటైన జంటను చూసి తానేం కోల్పోయాడో అర్థం అవసాగింది. ప్రదీప్ ఏమి చెప్పక పోవడం తో డ్రైవర్ మళ్లీ ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆలోచనలో ఉన్న ప్రదీప్ గమనించలేదు ఆ విషయం. సర్ సర్ ఇల్లు వచ్చింది అంటూ చెప్పేసరికి చటుక్కున కళ్ళు తెరిచాడు. ఎవరో ఇల్లు కట్టేటప్పుడు పెట్టిన చెట్లు భూతం లా ఉన్నాయి గాలికి ఊగుతూ, ఇంటి ముందు లైట్ లేదు చీకటిగా ఉంది. దెయ్యం కొంపలా అనిపించింది.

ఉసురంటూ కారు దిగుతూ ఉంటే సర్ నాకు ఒక రెండు రోజులు సెలవు కావాలి అన్నాడు డ్రైవర్ ఎందుకు అడిగాడు ప్రదీప్ రేపు దసరా పండగ సర్ మా అత్తగారు పిలిచారు. వెళ్ళక పోతే బాగోదు అందుకే సెలవు సార్ అంటూ అడిగాడు.

సరే వెళ్ళు ఇదిగో డబ్బులు ఉంచు అంటూ కొన్ని నోట్లు తీసి ఇచ్చాడు. డ్రైవర్ నమస్కారం చేసి వెళ్తూ ఉంటే ప్రదీప్ ఇంట్లోకి కదిలాడు. డ్రైవర్ కొంత దూరం వెళ్ళగానే ఈల వేస్తూ సంతోషంగా వెళ్తుంటే అనిపించింది నేను కూడా దసరాకి మా ఇంటికి వెళ్తే బాగుంటుంది అని, అనుకున్నదే తడువుగా ఇంట్లోకి వెళ్లకుండా కారు తీసి అర్ధరాత్రి కూడా షాపింగ్ చేసే కాస్ట్లి షాపు లోకి వెళ్లి, తండ్రికి, చెల్లికి తనకు బట్టలు తీసుకున్నాడు. మిగతా షాపింగ్ అంతా చేసి, ఊరికి బయలు దేరాడు.

కారు లో వెళ్తే రెండు గంటలు జర్నీ ఊర్లోకి ప్రవేశించింది కార్. అప్పటికే ఊరంతా సద్దు మనిగింది. కారు ఇంటి ముందు అపాడు. కారు దిగి అన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఇంటి ముందు లైట్ లేదు. వాకిట్లో ముగ్గులు లేవు. చెట్లన్నీ ఎండి పోయినట్టుగా ఉన్నాయి. అవి చూస్తూ లోపలికి వెళ్ళిన ప్రదీప్ కి వంటింటి లో ఏదో పడిన శభ్డం అలాగే అబ్బా అనే తండ్రి బాధాకరమైన ఆర్తనాదం వినిపించి గబగబా అవన్నీ అక్కడే పారేశి లోపలికి వెళ్ళాడు.

అక్కడ తండ్రి చారో కూరో తెలియని పదార్థం సగం కాళ్ళ పై సగం నేలపై పడి ఉంది. తండ్రి కూర్చుని కాలు చూసుకుంటూ ఊపుకుంటూ ఉన్నాడు. అయ్యో నాన్నా మీరు ఇలా రండి అంటూ తండ్రిని లేపి, హాల్లోకి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు. తర్వాత చల్లని నీటితో బట్టను తడిపి కాళ్ళపై వేసి బర్నల్ రాశాడు. మీకెందుకు నాన్న ఇవ్వన్నీ పని మనిషి ని పెట్టుకోవచ్చు కదా అన్నాడు.

పని మనిషి ని పెట్టుకుంటే అదెప్పుడు మనతో ఉండదు కదరా, దానికి ఇల్లు, సంసారం, మొగుడు, పిల్లలు ఉంటారు కదా, అది మొగుడికి చేదోడు వాదోడుగా నాలుగు ఇళ్లలో పని చేస్తుంది. ఇక్కడ చేసినా దాని ఇంటికి అది వెళ్లి తన మొగుణ్ణి, పిల్లల్ని చూసుకోవాలి కదా, నా ఇంటి దీపం, కంటి వెలుగు ఎప్పుడో ఆరిపోయిందిరా అదే ఉంటే నాకిన్ని తిప్పలు ఉండేవి కావు.

మీ అమ్మ ఉన్నప్పుడు వంకలు పెడుతూ తిట్టేవాడిని, అలా తిట్టినందుకే కాబోలు నేను లేకుండా ఉండండి అని శిక్ష వేసింది రా… దాహం అయితే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. ఓ రాత్రి మెలకువ వస్తె కబుర్లు చెప్పి నిద్ర పుచ్చే వాళ్ళు లేరు. బయటి వాళ్ళు ఎంతైనా బయటి వారే, మన అనుకున్న తోడు పోతే ఇక ఆ బతుకు కుక్క కన్నా హినం రా, ప్రదీపూ ఆకలిగా ఉందిరా అన్న తండ్రి మాటలు ప్రదీప్ కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి.

వెంటనే వంటింట్లోకి వెళ్ళి చూసాడు. అన్నం పొద్దున వండింది ఉన్నట్టుగా ఉంది. చల్లగా పొడి పొడిగా ఉంది. తనకు తెలిసిన వంట మ్యాగీ ఒక్కటే అయినా ఫోన్ తీసి చూసాడు. వంటలు గబగబా కొన్ని టమాటాలు, వంకాయలు పచ్చి మిర్చి ఉల్లిపాయలు కోసి, బియ్యం కడిగి, గిన్నె పెట్టీ నూనె తో పాటు కూరగాయలని వేసి, తర్వాత బియ్యం వేసి నీళ్ళు పోసి మూత పెట్టాడు. పదిహేను నిమిషాలలో కిచిడి అయ్యింది.

గిన్నె తెచ్చి హాల్లో పెట్టీ, కంచాలు తెచ్చాడు. అప్పటికి తండ్రి కొంత మగతగా ఉన్నాడు. నాన్న నాన్న లే అంటూ ప్లేట్ లో అన్నం పెట్టి ముద్దలుగా చేస్తూ నోటికి అందించాడు. తండ్రి ఇన్నేళ్ళుగా కడుపు నిండా తిననట్టే అనిపించింది. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం తిన్నాడు. ప్రదీప్ కి సంతోషం వేసింది. నేను ఇంకా నాన్నని చూసుకుంటాను అనుకున్నాడు. తండ్రిని గదిలోకి తీసుకువెళ్లి పడుకో బెట్టాడు.

ఇంకా దసరా రెండు రోజులు ఉంది. ఈ రెండు రోజులూ ప్రదీప్ ఇంటి పనులు చేయలేక పోయాడు తన స్థూలకాయం అందుకు సహకరంచడం లేదు. పైగా తనకు షుగర్ పొద్దున్నే ఏదైనా తినాలి అంటే చేసే వాళ్ళు లేరు. పని మనిషి వచ్చి పై పై తుడిచి, బట్టలు బండకేసి కొట్టి, అంట్లు తోమి వెళ్తుంది.

కనీసం శుభ్రంగా చేయదు ఇలా వచ్చి అలా వెళ్తుంది పది నిమిషాలలో పని అయిపొయింది అంటూ, ప్రదీప్ మళ్లీ ఇల్లు తుడిచి, అంట్లు మళ్లీ కడీగి, వంట చేసుకునే లోపు తండ్రి నాలుగు సార్లు నీళ్ళని, కాఫీ అని లేదా తినడానికి ఏదైనా పెట్టమని అడగడంతో అటు ఇటూ తిరిగే సరికి అలవాటు లేని పని కావడంతో చేసుకోలేక పోయాడు.

దసరా ముందు రోజు హఠాత్తుగా చెల్లి వచ్చింది. అన్నను చూసి కూడా మాట్లాడకుండా నాన్న ఎలా ఉన్నావు. రమ్మంటే రావు ఇక్కడ ఒక్కడివి ఎం చేస్తావు చూడు ఇల్లు ఎలా ఉందో నా పిల్లల పెళ్లిళ్లు అయ్యి మేము ఇద్దరమే ఉంటున్నాం. నువ్వొక్కడివేమీ మాకు ఎక్కువ కాదంటే వినవు అంటూనే మాట్లాడుతూనే గబగబా ఇల్లంతా శుభ్రం చేసింది, చెట్లకు నీళ్లు పోసింది. వాకిట్లో అలికి ముగ్గులు వేసింది. మాటల్లోనే రుచికరమైన వంట చేసేసి భోజనానికి పిలిచింది.

చాలా రోజుల తర్వాత ప్రదీప్ సంతృప్తిగా భోజనం చేశాడు. అచ్చు తల్లి చేసినట్టే చేసింది చెల్లెలు. తిన్న తర్వాత తండ్రికి మందులు వేసి, పడుకోబెట్టాక, అప్పుడు వంటగదిలో తింటున్న చెల్లి దగ్గరికి వెళ్ళాడు ప్రదీప్, చూసి కూడా చూడనట్టు చేసింది.

ఎందుకు నా పై అంత కోపం నేనేం చేశాను అని అన్నాడు ప్రదీప్. కంచం లో చెయ్యి కడుక్కుంటూ ఏం చేశాను అని సిగ్గు లేకుండా అడుగుతున్నావు అమ్మ చావుకి కారణం నువ్వు కాదా, నాన్న ఒంటరిగా ఉండడానికి కారణం నువ్వు కాదా, నా పిల్లల పెళ్లిళ్లు చాలా రోజుల వరకు కాకపోవడానికి కారణం నువ్వు కాదా, నా అత్త బ్రతికి ఉన్ననాళ్ళూ నన్ను చంపుకు తిన్నది నీ వల్ల కాదా, ఛీ సిగ్గులేని జన్మరా నీది నీ సుఖం కోసం మమల్ని అందర్నీ బాధ పెట్టావు.

అమ్మ నీపై దిగులుతోనే పోయింది. నాన్న ఒంటరిగా అయ్యాడు. ఏం సాధించావురా పెళ్లి చేసుకోను అంటూ,,, చెప్పు ఏం సాధించావు డబ్బా, పేరా, హోదానా, ఒరేయ్ ఇవన్నీ ఎవడు చూడరురా మనిషి కనిపిస్తే నీకెంత మంది పిల్లలు అని అడుగుతారు తప్ప నీ ఆస్తి పాస్తులు ఎవరూ అడగరురా, ఎంత సంపాదించావు కార్లు, మేడలు, మిద్దెలు ఇవ్వన్నీ నువ్వు అనుభవిస్తావా, శరీరం అంతా రోగాలతో మందులు మింగుతున్నావు.

అది కూడా గుర్తుంటే లేదంటే లేదు. ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే చస్తావు అప్పుడు నీకెవరూ తల కొరివి పెడతారు రా? నీ అస్తి ఎవడు తీసుకుంటాడు చెప్పరా చెప్పు, అంటూ ఏడ్చేసింది సీతా మహాలక్ష్మి. నాన్నమ్మ పేరు అది. వింటున్న ప్రదీప్ కూడా ఆగలేక పోయాడు తను కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు, ఏడుస్తూనే ఉన్నాడు….. ఏడుస్తూనే ఉన్నాడు…. ఏడుస్తూనే ఉన్నాడు….

గతించిన కాలం, వయసు, బాల్యం ఎప్పటికీ వెనక్కి రావు, రాలేవు, ఆడదానికైనా, మగాడికైనా నీ ఆస్తి ఎంతని ఎవరూ అడగరు, నీకు పిల్లలెంతమంది అనే అడుగుతారు. పిల్లలే మన అస్తి. పిల్లలే మన జీవితం. పెళ్లంటే భారం కాదు, బాధ్యత, మమతానురాగాల కలయిక.

ఓ యువతా, సహా జీవనం, స్వేచ్ఛా జీవనం పేరుతో ఒంటరిగా ఉండిపోకు, ఒంటరిగా వచ్చావు ఒంటరిగానే పోతావు కానీ మమతానురాగాలు అందుకునేది ఒక్క మానవ జన్మలోనే…. అది మర్చిపోకు.

– భవ్యచారు

0 Replies to “లివ్ ఇన్ రిలేషన్”

  1. చాలా మంది యువత చదవాల్సిన కధ ఇది
    తాత్కాలిక ఆనందం కోసం వివాహం వద్దు అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *