కత్తి అంచున నిలబడ్డ అక్షరం
రాత రాసేవాడి మీద
గీత దిద్దేవాడి మీద ఈ దేశం లో
అడుగు అడుగున సంకెళ్లే
ఇక్కడెవ్వరికి నిజాలు రుచించవు
చేదుగా వొగరుగా విషం చిమ్మే ఈ పదార్ధానికి
అబద్దానికున్నత
తీయదనం లేదు …
నిగ్గు తీసి నిలదీసిన పాపం
కుటుంబాలకి తీరని శాపమై
వెంటాడుతుంటాయి
కలుషితం కాబడ్డ మాటల్లో
అప్పుడో ఇప్పుడో చీకటిని చీల్చే సూరీడిలా
వస్తున్న చైతన్య కిరణాల్ని
అడ్డుకుంటూనే ఉంటాయి
కత్తి కన్న కలం గొప్పదే
అది రాజ్యాన్ని మోసినప్పుడు మాత్రమే
అని తెలుసుకునేదెవ్వడు
చివరి శ్వాస వరకు
సత్యం కోసం పోరాడే రాతగాళ్ళకి
మరణం తమ చివరి చరణం అయినా
వెరవని జీతగాళ్ళకి
బతుకొక త్యాగం …
ప్రజాస్వామ్యం లో వ్యక్తిస్వామ్యం
రాజ్యమేలుతున్నంత కాలం కళ్ళు తెరుచుకోవు
ఒప్పులైనా తప్పులైనా
పిచ్చోడి చేతి లో రాళ్లే
పాలకుల చేతకానితనానికి
నిలువెత్తు నిదర్శనాలే …
-గురువర్థన్ రెడ్డి