పద్మిని టీచర్

 పద్మిని టీచర్

 

నా చిన్నప్పుడు అతి గారాబం వల్ల నేను స్కూలుకు వెళ్ళకపోయేదాన్ని. అందరిలో చిన్నదాన్ని కావడంతో చాలా ఆలస్యంగా అంటే ఫోర్త్ క్లాసులో నన్ను బడిలో వేశారు. అలా కొత్త వాతావరణంలో ఈ మెడ లేక భయంతో ఎవరితోని మాట్లాడలేక బడికి వెళ్ళనని ఏడ్చేదాన్ని.

అలా కొన్ని రోజులు వెళుతూ కొన్ని రోజులు డుమ్మా కొడుతూ నా స్కూలు చదువు సాగింది. ఎప్పుడు స్కూల్ మానేస్తే బాగుంటుంది అనేది చూసే నాకు స్కూలు పైన ఆసక్తి కలిగేలా చేశారు పద్మిని టీచర్.. ఎనిమిదో తరగతి అనుకుంటా సోషల్ ఎగ్జామ్ పెట్టారు మేడం.

నాలుగు రోజుల తర్వాత పరీక్ష ఫలితాలు చెబుతూ ఈ ఎగ్జామ్ మొత్తంలో అద్భుతంగా రాసింది ఒక అమ్మాయి. ఎంత బాగా రాసిందంటే ఇంతవరకు నేను నా కెరీర్లో ఇంత మంచి ప్రశ్న పత్రాన్ని చూడలేదు.

ప్రశ్నలను విశ్లేషించుకుంటూ రాయడం మాత్రమే కాకుండా చక్కని వాక్య నిర్మాణం, పంచువేషన్ మార్క్స్ తో అద్భుతంగా రాసింది నాకు చాలా సంతోషం వేసింది అని చెప్పారు.

క్లాసులో పిల్లలందరూ ఎవరు ఎవరు టీచర్ అడిగారు. ఎవరంటే శైలజ అని చెప్పగానే నేను ఆశ్చర్యంతో తలమునకలయ్యాను. భయంతోనూ సిగ్గుతోను తలవంచుకొని కూర్చున్నాను.

పద్మిని మేడం దగ్గరికి వస్తూ లేచి నిలబడు శైలజ అంది. కానీ నేను బిరియాంగా అలాగే కూర్చున్నాను తానే దగ్గరికి వచ్చి నా భుజం పట్టుకొని బలవంతంగా లేపి నిలబెట్టింది.

అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టి శైలజకు అభినందనలు తెలియజేయండి అంది. కరతాల ధ్వనులతో క్లాస్ మొత్తం దద్దరిల్లిపోయింది.

ఆ రోజు నుంచి క్లాసులో నా రేంజ్ పెరిగిపోయింది. అప్పటివరకు అనామకురాలిగా ఉన్న నన్ను అందరూ ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టారు.

అప్పటినుంచి నాకు బడికి పోవాలంటే ఉన్న భయం ఎగిరిపోయింది క్లాసుల మీద చదవడం మీద ఆసక్తి పెరిగింది బడికి వెళ్లడంలో సంతోషం కూడా ఉంటుంది అనేది అర్థమైంది.

చక్కని స్నేహితులు కూడా అవుతారు అని తెలిసింది. అప్పటినుంచి ఇంట్లో పెద్దగా నసపెట్టకుండా బడికి పోవడం మొదలుపెట్టాను.

పద్మిని టీచర్ నన్ను మెచ్చుకొని క్లాప్స్ కొట్టించింది అని ఇంట్లో చెప్పగానే ఇంట్లో మా అన్నయ్యలు, అక్కయ్యలు అమ్మానాన్న కూడా క్లాప్స్ కొట్టి నన్ను ముద్దాడారు.

చిన్నదే అయినా ఈ సంఘటన నా జీవితంలోని మరిచిపోలేని ఘటన అని చెప్పవచ్చు అందుకే ధన్యవాదములు పద్మిని మేడం మీరు ఎక్కడున్నా సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.

ఈ సందర్భంగా మరొక టీచర్ ని తప్పకుండా గుర్తు తెచ్చుకోవాలి ఎవరు అంటే దేవమ్మ టీచర్. తను క్రాఫ్ట్ చెప్తుంది. అందరిలోనూ నేను బాగా అల్లికలు, కుట్లు చేస్తానని నన్ను ప్రత్యేకంగా చూసేది.

దగ్గర కూర్చోబెట్టుకొని మరి కాస్త కఠినంగా ఉన్న కుట్లను నేర్పేది. శైలజ నువ్వు చాలా తెలివైన దానివి. చక్కగా నేర్చుకుంటావు కదా అంటూ ముడి కుట్టు నేర్పిన విధానం నాకు ఇప్పటికి గుర్తుంది.

ఇలా ఈ ఇద్దరు టీచర్ల పాత్ర నా జీవితంలో చెప్పుకోదగ్గ అందమైన గుర్తులు.

వీరి పాత్ర నా జీవితంలో ఉండకపోతే ఇప్పుడు ఇలా నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఈ స్థితిలో ఉండేదాన్ని కాదేమో బహుశా..

పద్మిని టీచర్, దేవమ్మ టీచర్ ఈ గురుపౌర్ణమి సందర్భంగా మీకు పాదాభివందనములు ప్రేమతో మీ శిష్యురాలు🙏🙏

 

-మామిడాల శైలజ

0 Replies to “ పద్మిని టీచర్”

  1. చాలా బాగా చెప్పారు అక్క.. మన జీవితంలో మన గురువులకు ఉన్న స్థానం ఎంతో గొప్పది.. మీ ఈ రచన కీ మీ మేడమ్స్ కూ మీరు ఇచ్చే విలువకు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌అక్క..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *