బాల్కనీలో దయ్యం (క్రైమ్ కథలు – 1)

బాల్కనీలో దయ్యం
(క్రైమ్ కథలు – 1)

కారు ఇరవై అంతస్తుల ఆకాశ హర్మ్యం లోపలికి వస్తూనే రావుగారు తల పైకెత్తి ఆ అందమైన బాల్కనీల కేసి చూసారు.

“నమస్కారం రావుగారూ. రండి. సీతారామ్ చెప్పాడు మీరు వస్తున్నారని” ఆహ్వానించాడు మూర్తి.
“పదిహేనో అంతస్తులో ఫ్లాట్ అమ్మకానికుందని తెలిసింది. మాటల్లో సీతారామ్ చెప్పాడు ఈ ఫ్లాట్స్‌లోనే తనకి తెలిసిన వాళ్ళు… అంటే మీరు ఉంటున్నారని”
“మీకు స్వంత విల్లా ఉందని చెప్పాడే సీతారామ్”
“ఫాక్టరీకి దగ్గరగా ఉంటుందని ఊరికి దూరమైనా అక్కడే ఒక విల్లా కొన్నానండి. నాకు సభలు, సమావేశాలు అంటే ఆసక్తి.
మాటిమాటికీ సిటీకి రావడం కష్టంగా ఉంది. డ్రైవర్ని నమ్ముకోలేం. అందుకే ఈ ఫ్లాట్ కొందామనుకుంటున్నా. మా అబ్బాయి సందీప్ యూ.ఎస్. నుండి వచ్చేస్తున్నాడు. వాడూ, కోడలు ఆ విల్లాలో ఉండి ఫాక్టరీ పనులు చూసుకుంటారు. నేను పదవీ విరమణ చేసినట్టే అనుకోండి”
“కానీ మీకు కొన్ని విషయాలు చెప్పాలి…”
“ఫ్లాట్ చూస్తా మాట్లాడుకుందామా?”
ఫ్లాట్ అంతా కలియతిరుగుతూ బాల్కనీలోకి వచ్చారు.
“నేను చెప్పాలనుకున్న విషయం. నాలుగేళ్ళ క్రితం ఒక అమ్మాయి ఈ బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది”
“ఇంటి యజమానుల కూతురా?”
“కాదు అద్దెకున్నవాళ్ళే. తండ్రీ, కూతురే ఉండేవారు. తల్లి లేదనుకుంటా. హైదరాబాద్కి వచ్చి మహా అయితే రెండు నెలలు ఉన్నారేమో. వాళ్ళ గురించి ఎవరికీ వివరాలేం తెలియవు. అయితే ఆ అమ్మాయి వ్యభిచార నేరం కింద అరెస్ట్ అయి విడుదలైందట. ఆ అవమానంతోనే ఆత్మహత్య చేసుకుందంటారు. తండ్రి ఇల్లు ఖాళీ చేసి ఏదో వృద్ధాశ్రమంలో చేరాడని విన్నాము”
“ఈ కాలం ఆడపిల్లలు ఇలానే ఉన్నారండి. విలాసాలకి అలవాటు పడడం, డబ్బు కోసం బరితెగించడం. సాంప్రదాయం, విలువలనేవి లేవు. అయితే నాలుగేళ్ళ నుండి ఫ్లాట్ ఖాళీగానే ఉందా”
“లేదండీ. ఆ సంఘటన జరిగిన తర్వాత సంవత్సరం ఖాళీగా ఉంది. తక్కువకి వస్తోందని అప్పుడొక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కొన్నారు. కానీ ఆర్నెల్లకే ఆయన కూడా ఈ బాల్కనీలో పైన వేలాడదీసిన కుండీల్లో పువ్వులు కోస్తూ జారి కిందకు పడిపోయి… ఆ చనిపోయిన అమ్మాయి దయ్యమై ఈ బాల్కనీలోనే తిరుగుతూ ఉంటుందంటారు. అందుకే ఆ సి.ఐ. గారి కుటుంబం మార్కెట్ ధరకి సగానికే అమ్మకానికి పెట్టారు. మీరు మా సీతారామ్‌కి బాగా కావలసినవాళ్ళు. అందుకే ఇవన్నీ చెప్తున్నాను”
“నాకు ఈ నమ్మకాలు అస్సలు లేవండీ. పైగా ఇటువైపు వెళుతున్నపుడల్లా నన్ను బాగా ఆకర్షించేవి ఈ అందమైన బాల్కనీలే. ఫ్లాట్ యజమానుల వివరాలు ఇవ్వండి. నేను డీల్ మాట్లాడుకుంటాను”

ఆ సి.ఐ. కూడా ఎప్పుడూ బాల్కనీలోనే కూర్చునేవాడంటారు అనుకున్నాడు మూర్తి.
*

సందీప్ యూ.ఎస్. నుండి అత్యవసరంగా తిరిగొచ్చి జరగవలసినవన్నీ పూర్తి చేసాడు. తాళాలు హాండోవర్ చేసుకుని ఫ్లాట్ అంతా కలియతిరుగుతూ బాల్కనీలోకి వచ్చాడు. బాల్కనీ నిజంగానే ఆకర్షణీయంగా ఉంది. రెయిలింగ్ మీద చేతులు పెట్టి ఆలోచిస్తున్నాడు.

‘నాన్న ఫ్లాట్ ఇలాంటిదని తెలిసీ ఎందుకు కొన్నారు? ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటున్నపుడు బాల్కనీలోకి వచ్చి
జారి కిందకు పడిపోయి చనిపోవడమేమిటి?’ బుర్ర నిండా సమాధానం దొరకని ప్రశ్నలు.

అతడికి హఠాత్తుగా శ్వేత గుర్తుకు వచ్చింది. తనని నమ్మి విశాఖపట్నం బీచ్ రిసార్ట్లో సర్వస్వం అర్పించిన శ్వేత. తమ విషయం తెలిసి తండ్రి అక్కడ ఎవరో పెద్దమనిషిని ఆశ్రయించాడు. ఆయన పంపిన పోలీసులు రైడ్ చేసి లాక్కుపోతుంటే “మనం ప్రేమికులమని చెప్పు సందీప్” అని ప్రాధేయపడిన శ్వేత. తనని కావాలని తప్పించిన పోలీసులు. ఆ శ్వేతేనా ఇక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది? రైడ్ చేసిన ఆ సర్కిల్ ఇన్‌స్పెక్టరేనా తర్వాత ఈ ఫ్లాట్ కొన్నది? తరువాతి వంతు నాన్నదయిందా?’

‘బాల్కనీలో దయ్యం?’
‘అంటే ఇప్పుడు…?’ ఒళ్ళంతా చెమటలు పట్టాయి.

అతడిని ఎవరో వెనకనుండి కాళ్ళ మడమల దగ్గర గట్టిగా పట్టుకుని బలంగా పైకి లేపుతున్నారు.

(దయ్యాలు ఉన్నాయని నమ్మను కానీ ఇలాంటి దయ్యాలుంటే బాగుంటుంది అనిపిస్తుంది)

 

– అనిశెట్టి శ్రీధర్ (IOB- Rtd.,)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *