తొలి ఏకాదశి
శుభాకాంక్షలు.
పాల కడలిపై శయనించు స్వామీ
అలసిన తనువుకు
విశ్రాంతి నీయవోయి,
గందరగోళ మానవ కోర్కెలకు
మౌనంతో సమాధాన పరచవోయి,
హరినారాయణ శ్రీమన్నారాయణ
శయనించు తనువుతోనైనా
మా పూజలు స్వీకరించు స్వామీ.
హరి నామసంకీర్తనమే మము
వైకుంఠము చేర్చునోయి,
మదిని వీడని నీనామమే
ఏడుకొండలెక్కు శక్తివోయి,
అంతట నీవే కనిపించి
ప్రహ్లాదుడను మురిపించావు,
మా ఆత్మయందు
భక్తామృతం నింపవోయి.
హరినారాయణ శ్రీమన్నారాయణ మా జీవశ్వాసగా వుండిపోవా స్వామీ.
సర్వ వేళలందు రెప్పవాల్చకుంటాను
ఒక్క క్షణమైనా దర్శనమీయవా దేవా,
నిను చూడాలను ఆకాంక్షకే దాసుడను నేను
వేరే వరములు అడగలేను స్వామీ,
నా బాహ్యంతర జగము
నిన్నే చేసుకున్నాను
నాధ్యాస నీపైనుండి మరల్చనీయకు స్వామీ,
కర్మలు తొలిగించమని అడగలేను
నిత్యం నీపూజలో
నా మనసుంటే చాలు
మలినాలు దరిచేరువుగా దేవా,
సకలలోక సంరక్షకా
సత్యోదయంతో వచ్చి
మనసు యాతనలు తీర్చు స్వామీ
హరినారాయణ శ్రీమన్నారాయణ
మా అంతరంగము నందు
ఆనందనిధిగా వుండిపోవా స్వామీ
-గురువర్థన్ రెడ్డి