అశరీరవాణి
నల్లని మేఘాలు
కమ్మేస్తుంటాయి
గమ్యం లేని ఆలోచనలు
గతుకు రోడ్డుపై ప్రయాణంలా ఉక్కిరిబిక్కిరి అవుతుంటాయి
గతి తప్పిన మనసు
చక్రం తిప్పిందంటే నమ్మలేం
కురిసే చినుకుల్లా జ్ఞాపకాలు
తడిపేస్తుంటాయి
కలలన్నీ మట్టిపరిమళాన్ని పూసుకుంటాయి
అప్పుడప్పుడు
మనసు,బుద్ధి మనిషిని
లాగేస్తుంటాయి
మధ్యలో హృది చేరుతుంది
గందరగోళం జతచేరుతుంది
ఎన్నికల వాగ్దానాల్లా
అలవాటైన ప్రయాణంలో
అంతరాత్మ జొరబడి చక్కదిద్దాలనుకుంటాం
మనిషీ..పగ్గాలొదిలి పక్కకు చూడకు
చక్కదిద్దుకో..
అశరీరవాణి పలుకుతోంది
-సి.యస్.రాంబాబు