అర్ధ నగ్న సత్యం
ఆమె..
మనిషిగా బాధపడాలో
ఆడ మనిషిగా ఉన్నందుకు
వ్యధ చెందాలో తెలియక…
దేహ భాష ను మాట్లాడే లోకంలో ఇమడలేక …..
మాటల శాసనాలను ఇనుప సంకెళ్లుగా
అనుసరిస్తుంది.
పసివయసు తండ్రి చెంత
పసిడి మేలిమి ప్రతిభల గుబాళింపులో
పదహారు ప్రాయాన
చిలిపి నవ్వుల కేరింతలై
ప్రాయమెరిగిన వేళ మగని చాటు ఇల్లాలుగా
పంతం ఎరిగిన బాధ్యతల మధ్య
రెక్కలు వుండీ ఎగురలేని విహంగమై
మానవ మైలని నవమాసాలు మోసి
భూమికి భారాన్ని పెంచుతూ..
తనను కాదన్న తనయునికి తల్లిగా..
మృగరాజుల వంటి వారికి స్తన్యాన్ని ఇచ్చి
చేదు రసాన్ని మింగి
మానవత్వం లేని చోట
రాక్షసుల క్రీనీడలలో
విధి వంచిత అవుతున్నా !
స్వేచ్ఛను ఎరుగని స్వేచ్ఛా జీవి ఆమె
ఐదు అంకెల ఆర్జనతో..
బ్రాండెడు బ్యాగులో….
వంద ఖర్చుకి కూడా దొరకని స్వాతంత్రంలో..
తర్జనభర్జనల జీవితానికి
వంటఇంటి వెలుగై
పగటికీ, రేయికీ
తేడాలు తెలియక బలైపోతున్నా !
వేదాలు కొలిచే చోట
ఆంక్షలకు గురవుతూనే..!
గబ్బిలాలు తిరిగే చోట
చందన పరిమళాలు వెతుకుతోంది.
మనిషి గా విలువ లేని చోట
మనసు విలువకు పరితపిస్తూ
మంచు పర్వతాల్లో
ఎగసిపడే లావా కోసం నిరీక్షిస్తూ
క్షణ క్షణం ఓడిపోతానని తెలిసినా
గెలుపు గుర్రం ఎక్కాలనే ప్రయత్నంలో..!
restకి, rest-in కి తేడా తెలియని మార్పుల మరకలంటని మాతృమూర్తి
ప్రశ్నగా మిగిలిపోతున్న ఓ సమాధానం…!!
ఆమె..
అందమైన నవ్వుల వెలుగులలో
దాగిన అర్ధ నగ్న సత్యం—?
-గురువర్థన్ రెడ్డి