కనుల కాగడాలు
నీ మనోకాశంలో
రాలిన అక్షరాలలో తడిసి
నేనొక కవితగా మారాలని
ఆనందంగా పరవశించాలని
ఆ.. నిరీక్షణలో శిలగా మారాను
ప్రేమసాగరతీరంలో..
నీ వెచ్చని అనుభూతులు
రెక్కలువిప్పి..నా కన్రెప్పల కొమ్మలపై
గూడుకట్టుకుని..కూనిరాగాలు
తీస్తున్నాయి..నీ వలపు మత్తులో
నీవు వస్తావు కదూ..నా ప్రాణమా
నీ జ్ఞాపకాల సుగంధాలు
నాశ్వాసకు ఊపిరిపోసి
వసంతాలను పంచుతున్నాయి
నా జీవనప్రస్థానంలో..
నీకు గుర్తుందా.. ఆరోజు
నా గుండెపై..నీవుచేసిన ప్రేమసంతకం
చెరగని పాలపుంతలా
వెలుగులను చిమ్ముతూనేవుంది
చల్లని వెన్నెలరాత్రిలా
వెన్నెల చినుకుల్ని వర్షిస్తూనేవుంది
ప్రతిరాత్రి
కలల సామ్రాజ్యపు రాణిలా
మురిపిస్తున్న నీవు.. నా కనుపాపల
పరదాపై
శాశ్వత చిత్రంగా మిగిలిపోయావు
గతస్మృతులను గుర్తుచేస్తూ..
ఏ కాలమైనా సరే..నీ కోసమే
నా కనులకాగడాలు
వెలుగుతూనే వుంటాయి
నీ రాకకోసం వెలుగునందిస్తూ..
నా మానసికవీణ సుమధుర రాగాలను
పలుకుతూనే వుంటాయి
నీకు స్వాగతం పలుకుతూ ..
నీవు వస్తావు కదూ…..!
-గురువర్థన్ రెడ్డి