భవిష్యత్తు

భవిష్యత్తు

భవిష్యత్తు గురించి చాలా కలలు కంటారు అందరూ. దాని కోసం డబ్బు సంపాదించడం మొదలు పెడతారు . సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతూ ఉంటారు.

నిజమేసంపాదించాలి, సంపాదించాలి భవిష్యత్తు లో నా తర్వాత నా మనవళ్ళు ముని మనవళ్ళు బతకాలి ఏ లోటూ లేకుండా జీవించాలి అంటే ఇప్పుడు నేను సంపాదించాలి అని అనుకుంటూ ,మనిషి తన విలువైన సమయాన్ని తాను మాత్రమే ఆస్వాదించే క్షణాలను వదిలేసి డబ్బు సంపాదనలో పడి చిన్న చిన్న ఆనందాలను కోల్పోతూ ఉన్నాడు.

వర్షం చినుకులను, అపుడే విచ్చుకుంటున్న పువ్వులను, ఇంద్ర ధనస్సు ను, ఆకుల పై రాలిన వర్షపు ముత్యాలను, ఒక్క వర్షానికే చెల్లా చెదురు అయిన జనాలను, రోడ్డంతా ఖాళీగా ఉన్నప్పుడు మనం ఒక్కరి మే తిరిగే క్షణాలను, వేడి వేడి అన్నం లో ముద్ద పప్పు , అవకాయ కలుపుకుని తినే మధురానుభూతులను,

తల్లీ దండ్రుల తో గడిపే సమయాన్ని, కుటుంబం అంతా కలిసి వెన్నెల్లో చేసే వన భోజనాలను, ప్రేమగా కలిపి అన్నం పెట్టే అమ్మను, బాగా కష్ట పడుతున్నావు అంటూ భుజం తట్టే నాన్న అభిమానాన్ని ఇవన్నీ వదిలేసి సంపాదన భవిష్యత్తు అనే పేరు తో నిన్ను నువ్వు బంధించుకొని,

నీ చుట్టూ ఒక చట్రాన్నీ బిగించుకొని ఎవరేం మాట్లాడినా కోప్పడుతూ , అన్నిటికీ లెక్కలు కడుతూ ,క్షణం, క్షణం అందరికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించి పరుగులు పెట్టిస్తూ, అందరికీ అజాత శత్రువు గా మారిపోయి నీ కోరికలన్నీ చంపుకుంటూ, భవిష్యత్తు గురించి డబ్బు అనే ఎండమావి వెంట వెళ్తున్నావు,

నిజమే భవిష్యత్తు కు డబ్బు కావాలి. కానీ చిన్న చిన్న సంతోషాలను వదిలేసి, చిన్న చిన్న ఆనందాలను వదిలేసి భవిష్యత్తు కోసం సంపాదనలో మునిగి తేలుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా చనిపోతారో తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులూ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *