నాన్న అలిగాడు 

నాన్న అలిగాడు 

రాత్రి ఒంటిగంటకి
ఊరి నుండి తిరిగి వచ్చి
అమ్మ అతని కోసం
ఎదురు చూస్తూ
ఇంకా బోంచేయలేదని
తెలియగానే
నాన్న అలిగాడు

డబ్బులు కి
ఇబ్బంది గా వుందని
నాన్న అమ్మ తో
అనడం విని
తెగిన చెప్పుకి
పిన్నీసు పెట్టుకుని
స్కూలుకు వెల్లడం చూసి
ఎందుకు చెప్పలేదు అని
నాన్న అలిగాడు

మా ప్రయాణ ఖర్చులు తలచి
ఊరిలో మామయ్య
ఆక్సిడెంట్ విషయం
అమ్మమ్మ తెలపకపోతే
సుఖాలలోనేనా బంధుత్వం
కష్టాలు లో కాదా అని
నాన్న అలిగాడు

మిగిలిన బోజనంతో
వీధిలో ఏ కడుపు
ఆకలినో తీర్చే బదులు
చెత్త కుండీలో
విసిరేయడం చూసి
ప్రతి గింజ విలువైనదేనని
నాన్న అలిగాడు

వారం రోజులు నుండి
జ్వరం తో మంచం
పట్టిన నానమ్మ
దభదభమని అకస్మాత్తుగా
వర్షం పడితే
గాబరాగా వెళ్ళి
బాల్కనీ లో
ఆరేసిన బట్టలు
తీయడం చూసి
నాన్న అలిగాడు

నాన్న అలకలో
స్వచ్ఛమైన
ఆప్యాయత ఆదరణ
ఆ అలకకే
ఒక వింత అందం తెస్తుంది
ఆ అందమే మా ఇంటికి
ఒక నమ్కకమైన
వెచ్చని వెలుగునిస్తుంది…

– గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *