అమ్మాయి మనోవేదన
చీకటి కప్పుకున్న రాత్రి ఒకటి నడచివస్తుంటే మెల్లగా
నడకలు రాని పసిపాపలా పగలు ఒంటరయ్యింది జీవితమనే ఒంటరి పోరాటంలో
ఎన్ని పగళ్లు…ఎన్ని రాత్రుళ్ళు గడిచాయో
ఆమెలో దాగున్న నక్షత్ర మేఘాలు దారి కనపడక నిత్యం కన్నీటి
ధారలా పొంగి పోరాలుతూనే ఉన్నాయి..
యుగ యుగాలనాటి అంధవిశ్వాసాలు రెక్కలొచ్చి నిత్యం స్వేచ్ఛగా విహరిస్తూనే ఉన్నాయి..
అంధకార భందనంలో
ఒంటరితనపు ఉక్కపోతొకటి వేటాడుతుంటే
స్వేచ్ఛా ఊపిరిలును గుండె నిండా ఊదలేక
ఆపే శక్తీ లేక
ఆదరించేవారు లేక
ఆనందాలన్నీ చీదేసిన ముక్కుకి వేలాడుతుంటే
నిత్యం ఓడలేక ,వాడిపోతూ
నవ్వలేక నవ్వుతూ
నడిచే శక్తి లేకపోయినా..
యంత్రమనే చక్రాన్ని కాళ్లకు కట్టుకొని
నడి బజారులో అమ్ముడుపోతూనే ఉంది…
మృగాళ్ల మృగత్వానికి సూచికగా
వీధి వీధి ఆక్రోశిస్తూనే ఉంది ఆడకూతురిని అల్లరిపాలు చేయొద్దంటూ
తర తరాల బానిసత్వానికి గుర్తుగా నట్టింట్లో దూలానికి
ఉరితాడులా వేలాడుతూనే ఉంది నేటి మహిళా జీవితం..
పసిగుడ్డని కూడా చూడకుండా ముళ్ల పొదల మాటుకు
విసిరేయబడుతూనే ఉంది…
కామాంధుల కర్కశత్వానికి నిదర్శనంగా మిగిలిపోతూనే ఉంది…!!
-గురువర్ధన్ రెడ్డి