జాషువ కవి….! వేకువ రవి…!!
పద్యరచన ప్రాణంగా
సంఘ మార్పు ధ్యేయంగా
తిరుగుబాటు జెండ పట్టి
నిమ్న జాతి గుండె తట్టి
కులం గబ్బు రోత చూసి
కలం పట్టి కవిత రాసి
జాషువచూపిన మార్గం
సమతా మమతల స్వర్గం
చెప్పు కుట్టు కష్టజీవి
పంచముడని ముద్రవేసి
అంటరానితనం జూపి
ఊరినుండి తరిమివేసె
పెద్ద కులం మతం మీద
పద్య ఫిరంగీల మోత
మోగించిన కవి జాషువ
రగిలించెను దళిత తెగువ
వరించి వచ్చిన శారద
తెచ్చిన సత్కార బిరుదు
నవయుగ కవి చక్రవర్తి
పద్మభూషణనే కీర్తి
పగటి దివిటీల నడుమ
పల్లకి ఊరేగె గరిమ
జాషువ ధీ కవితార్చన
నవ్య కవులకో ప్రేరణ
ముసాఫరులు క్రీస్తు చరిత
స్వయంవరం మరి నా కథ
నాగార్జున సాగరమూ
ముంతాజు మహాలనే
కావ్య రచన చేసినట్టి
పద్య కవుల జగజ్జెట్టీ
గండపెండిరము ధరించె
గుర్రం జాషువ విరించి
విశిష్ట గిజిగాని గూడు
వర్ణించిన సుకవి రేడు
ఖండ కావ్య రచన చేసి
ఖండాంతర ఖ్యాతి మోసి
ప్రతి మనిషికి చివరి మజిలి
శ్మశాన సమతా కౌగిలి
ఒదిగిన మనజాషువ కవి
ఎదను మీటె వేకువ రవి…
-గురువర్ధన్ రెడ్డి