మేరు పర్వతం
ఒకే తల్లి గర్భస్థావరము
నుంచి ఉద్భవించిన
తోబుట్టువులo మనం!
అమ్మ రక్త మాంసాలతో జవజీవాలను అందుకున్న
అన్నాచెల్లెళ్లo మనం!
నేను పుట్టిన మరుక్షణం అమ్మ పొత్తిళ్లలో నుంచి ఆత్మీయంగా అందుకుని ఆటపాటలతో అలరించిన అద్భుతమైన బంధానివి!
ఎదుగుతున్న కొద్దీ
ఎదురవుతున్న ఆటంకాల
నుంచి నన్ను కాచుకున్న సహోదరుడివి!
అడుగడుగునా అoగుష్టష్టమాలులు
సంచరిస్తున్న జనారణ్యంలో అనుక్షణం అంగరక్షకునిలా కాపాడిన దీరుడివి!
విద్యాగంధంలో నిన్ను మించిన దానిని చేయాలని నా ప్రతిభను రాణింపచేయాలని ప్రతీక్షణం పరితపించావు!
అలసిన నాన్నకు కుడిభుజమై నిలిచి నన్ను సర్వకాలసర్వావస్థల్లో అండగా నిలిచే తోడును ఎంచి
నాకు వరంగా అందించావు!
జనకుడు నీవై జానకి లాగా మెట్టింటికి సాగనంపి
పుట్టింటివై మిగిలావు!
నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటూ అన్నివేళలా నాకు
ఆపేక్షను పంచావు!!
నలుగురిలో మిన్నగా నిలిస్తే
నాన్న కంటే ఎక్కువగా
గర్వించావు!
హిమగిరి శిఖరం లాంటి
నీ వాత్సల్యాన్ని వర్ణించబూనడం సాహసమే అవుతుంది అన్న!
నీ అమలిన ఆప్యాయత ముందు
ఆ మేరు పర్వతమే చిన్న!
అమ్మ కడుపు చల్లగా నిన్ను చుట్టుముట్టిన ఆపదలన్నీ కరిమబ్బుల్లా తొలగిపోయి
నిష్కల్మషమైన నిండు
సూర్యుడిలా ప్రభవించాలి!
నిండు నూరేళ్లు వర్ధిల్లాలి!
పెద్ద మనసుతో దీవిస్తున్న
వయసున నీకు చిన్నైనా ఓ అన్నా!!
-మామిడాల శైలజ